Broadband India: భారత్‌లో ఇప్పుడు బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్య ఎంతో తెలుసా?

Broadband India crosses 1 Billion users milestone
  • భారత్‌లో 100 కోట్ల మార్కు దాటిన బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు
  • నవంబర్ నాటికి 100.37 కోట్లకు చేరారని కేంద్రం వెల్లడి
  • 2015తో పోలిస్తే పదేళ్లలో ఆరు రెట్ల వృద్ధి నమోదు
  • మొత్తం వినియోగదారుల్లో సింహభాగం వైర్‌లెస్ ఇంటర్నెట్ వారిదే
  • గతేడాదితో పోలిస్తే పెరిగిన వైర్‌లెస్ సేవల ఆదాయం
భారత డిజిటల్ రంగంలో చారిత్రక మైలురాయి నమోదైంది. దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్య 100 కోట్ల (1 బిలియన్) మార్కును అధిగమించింది. ఈ విషయాన్ని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ బుధవారం అధికారికంగా వెల్లడించింది. గత దశాబ్ద కాలంలో ఇంటర్నెట్ విస్తరణ ఎంత వేగంగా జరిగిందో తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

గత పదేళ్లలో భారత్‌లో బ్రాడ్‌బ్యాండ్ వినియోగం ఆరు రెట్ల కంటే ఎక్కువగా పెరిగింది. 2015 నవంబర్ నాటికి దేశంలో కేవలం 13.15 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు ఉండగా.. 2025 నవంబర్ నాటికి ఆ సంఖ్య రికార్డు స్థాయిలో 100.37 కోట్లకు చేరింది. స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరగడం, డేటా చౌకగా లభించడం ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

మరోవైపు, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జులై-సెప్టెంబర్) కూడా ఇంటర్నెట్ చందాదారుల సంఖ్య పెరిగింది. జూన్ నాటికి 100.28 కోట్లుగా ఉన్న మొత్తం ఇంటర్నెట్ వినియోగదారులు.. సెప్టెంబర్ నాటికి 1.49 శాతం వృద్ధితో 101.78 కోట్లకు చేరారు.

దేశంలో వైర్డ్ ఇంటర్నెట్ కంటే వైర్‌లెస్ ఇంటర్నెట్ (మొబైల్ డేటా) వాడేవారే ఎక్కువగా ఉన్నారు. మొత్తం చందాదారుల్లో సుమారు 97.33 కోట్ల మంది వైర్‌లెస్ సేవలు పొందుతుండగా... 4.44 కోట్ల మంది మాత్రమే వైర్డ్ ఇంటర్నెట్ వాడుతున్నారు. బ్రాడ్‌బ్యాండ్ వినియోగం పెరుగుతుండగా... నారోబ్యాండ్ వినియోగదారుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అలాగే, వైర్‌లెస్ సేవల ద్వారా వచ్చే సగటు ఆదాయం (ARPU) కూడా వార్షిక ప్రాతిపదికన 10.67 శాతం పెరిగినట్లు ట్రాయ్ నివేదిక పేర్కొంది.
Broadband India
India internet users
TRAI
Telecom Regulatory Authority of India
Wireless internet India
Mobile data India
Digital India
Internet subscribers India

More Telugu News