ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారికి ఈరోజు ఆరో పుట్టినరోజు.. ఆనాటి రోజులను గుర్తు చేసుకుందాం!

  • 2019 డిసెంబర్ 31న ప్రపంచంలోకి అడుగుపెట్టిన కరోనా
  • లక్షల మందిని బలిగొన్న భయంకర మహమ్మారి
  • మనుషుల మధ్య బంధాలను ప్రశ్నించిన కరోనా
  • ప్రపంచాన్ని బతికించిన ఇండియా వ్యాక్సిన్లు
  • ఇప్పటికీ జనాల ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపిస్తున్న కరోనా

యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికించిన సందర్భాన్ని ఎవరూ మరిచిపోలేరు. ఆరోజు కరోనా దెబ్బకు బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు అన్నీ ప్రశ్నార్థకమయ్యాయి. తోటి మనిషిని చూస్తేనే భయపడే పరిస్థితులను అందరూ అనుభవించారు. సరిగ్గా ఆరేళ్ల క్రితం ఇదే రోజు, , 2019 డిసెంబర్‌ 31... ప్రపంచమంతా కొత్త ఏడాదికి వెల్‌కమ్‌ చెప్పేందుకు సిద్ధమవుతున్న సమయం. సంబరాలు, వేడుకలు, ఆశలతో నిండిన క్షణాలు. కానీ అదే సమయంలో, ఎవరూ ఊహించని ఒక విపత్తు నిశ్శబ్దంగా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అదే కోవిడ్-19.


ఆ తర్వాత ఏమైంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన తరం ఎప్పుడూ చూడని విధంగా ఒక మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. జనాలు ఇళ్లలోనే బందీలయ్యారు. 'లాక్‌డౌన్' అనే పదం రోజువారీ జీవితంలో భాగమైంది. పని, చదువు, ప్రయాణం, పండుగలు అన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.


ఈ మహమ్మారికి కేంద్రంగా చైనాలోని వుహాన్ నగరం నిలిచింది. అక్కడ మొదట నమోదైన కేసులను ఆరోగ్య నిపుణులు సాధారణ న్యూమోనియాగా భావించారు. కానీ రోజులు గడిచే కొద్దీ కేసుల సంఖ్య పెరిగింది, లక్షణాలు తీవ్రంగా మారాయి. దీంతో ఇది సాధారణ వ్యాధి కాదని వైద్య నిపుణులు గ్రహించారు.


వుహాన్‌లోని ఫిష్ మార్కెట్‌ పరిసరాల్లో మొదట కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. అక్కడి నుంచి ఈ వైరస్‌ దేశాలు, ఖండాలు దాటి యూరప్‌, అమెరికా, ఆసియా, ఆఫ్రికా వరకు విస్తరించింది. 21వ శతాబ్దంలోనే అత్యంత భయంకరమైన మహమ్మారిగా కోవిడ్-19 గుర్తింపు పొందింది.


2020 మార్చి నాటికి పరిస్థితి పూర్తిగా చేతుల్లోనుంచి జారిపోయింది. దేశాలు సరిహద్దులు మూసేశాయి. నగరాలు నిశ్శబ్దంగా మారాయి. ఎక్కడ చూసినా ఖాళీ రోడ్లు, మూసిన షాపులు, భయంతో ఉన్న ప్రజలు. అధికారిక లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది ఈ మహమ్మారిలో మరణించారు. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి.


కోవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు భారత్‌ 2020 మార్చిలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. ఇది ప్రజలకు కష్టమైన నిర్ణయమే అయినా, ఆసుపత్రులు సిద్ధం చేసుకోవడానికి, పరీక్షలు పెంచడానికి, ఆక్సిజన్‌ సరఫరా బలోపేతం చేయడానికి ఈ సమయం ఉపయోగపడింది.


అయితే, ఆ తర్వాత డెల్టా వేరియంట్‌ వచ్చాక పరిస్థితి మరింత భయంకరంగా మారింది. కొన్ని వారాల్లోనే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా కూడా భారత్‌ ఒక గొప్ప విజయాన్ని సాధించింది. తక్కువ సమయంలోనే స్వదేశీ టీకాలను అభివృద్ధి చేసింది. భారత్ బయోటెక్‌ తయారు చేసిన కోవాక్సిన్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌ రూపొందించిన కోవిషీల్డ్‌ కోట్లాది మందికి రక్షణగా నిలిచాయి. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని భారత్ విజయవంతంగా నిర్వహించింది. 


ఏది ఏమైనా కరోనా ప్రపంచాన్నే మార్చేసింది. దాని ప్రభావం ఇప్పటికీ కోట్లాది మంది ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతూనే ఉంది. మరోవైపు, మనుషుల మధ్య ఉన్న సంబంధాలను ప్రశ్నించింది. కష్టకాలంలో మనుషులు ఒకరికి మరొకరు తోడు ఉండరనే విషయాన్ని ప్రపంచానికి కళ్లకుకట్టింది.



More Telugu News