Vijayalakshmi: రమ్య కేసులో ఒకలా.. నా విషయంలో మరోలానా?: దర్శన్ భార్య విజయలక్ష్మి ఆవేదన

Darshan Wife Vijayalakshmi Expresses Disappointment Over Police Delay in Cybercrime Case
  • సోషల్ మీడియా వేధింపులపై పోలీసుల తీరును తప్పుబట్టిన విజయలక్ష్మి
  • బెంగళూరు పోలీస్ కమిషనర్‌ను కలిసిన దర్శన్ భార్య
  • రమ్య కేసులో వెంటనే స్పందించి తన ఫిర్యాదును నిర్లక్ష్యం చేశారని ఆరోపణ
  • విజయలక్ష్మి ఆరోపణలను ఖండించిన పోలీస్ కమిషనర్
సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసభ్యకర వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటూ కన్నడ నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫిర్యాదు పట్ల పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్‌ను కలిసి తన గోడు వెళ్ల‌బోసుకున్నారు.

అనంతరం సోషల్ మీడియా వేదికగా స్పందించిన విజయలక్ష్మి.. చట్టం అందరికీ ఒకేలా ఉంటుందని తాను నమ్మానని, కానీ తాజా అనుభవంతో ఆ నమ్మకం సడలుతోందని పేర్కొన్నారు. గతంలో నటి రమ్య ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు ఒక్క రోజులోనే చర్యలు తీసుకున్నారని, తన విషయంలో మాత్రం ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. లాయర్లు ఫాలోఅప్ చేస్తున్నా స్పందన లేదని, తన ఫిర్యాదును కనీసం పరిశీలించమని అడిగేందుకు తానే స్వయంగా రావాల్సి వచ్చిందని ఆమె వాపోయారు. ఈ జాప్యం వెనుక ఏదైనా బయటి ఒత్తిళ్లు ఉన్నాయేమోనన్న అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు.

మరోవైపు విజయలక్ష్మి ఆరోపణలను పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ ఖండించారు. పోలీసులు ఎవరి పట్ల పక్షపాతం వహించరని, చట్టప్రకారమే నడుచుకుంటామన్నారు. ఆమె ఫిర్యాదుపై ఇప్పటికే కేసు నమోదు చేశామని, ప్రస్తుతం డీసీపీ స్థాయి అధికారి విచారణ జరుపుతున్నారని స్పష్టం చేశారు. సాంకేతిక దర్యాప్తులో కొన్నిసార్లు కీలక ఆధారాలు దొరకడం ఆలస్యం అవుతుందని, అంత మాత్రాన కేసును నిర్లక్ష్యం చేసినట్లు కాదని వివరించారు. ఒకవేళ అధికారుల లోపం ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కాగా, సోషల్ మీడియాలో తనపై అసభ్యకర కామెంట్స్ చేస్తున్న సుమారు 15 ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై, 150కి పైగా అభ్యంతరకర వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలతో విజయలక్ష్మి గత వారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Vijayalakshmi
Darshan Thoogudeepa
Kannada actress
Ramya
cyber crime
social media abuse
police complaint
Bengaluru police
cybercrime investigation
Karnataka

More Telugu News