వెంకటేశ్ గారి శ్రీమతి చెప్పిన మాటే నిజమైంది: త్రివిక్రమ్

  • 2001లో విడుదలైన 'నువ్వు నాకు నచ్చావ్'
  • వెంకటేశ్ సరసన సందడి చేసిన ఆర్తి అగర్వాల్ 
  • అప్పట్లో భారీ విజయాన్ని సాధించిన సినిమా
  • ఆనాటి సంగతులను గుర్తుచేసుకున్న త్రివిక్రమ్ - రవికిశోర్ 
  • రేపు రీ రిలీజ్ అవుతున్న సినిమా

వెంకటేశ్ - ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన 'నువ్వు నాకు నచ్చావ్' సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్. త్రివిక్రమ్ కథ - మాటలు అందించిన ఈ సినిమాకి, విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. 2001 సెప్టెంబర్ 6వ తేదీన విడుదలైన ఈ సినిమా, భారీ వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమాను జనవరి 1వ తేదీన రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాను గురించిన  విషయాలను నిర్మాత స్రవంతి రవికిశోర్ - త్రివిక్రమ్ ముచ్చటించుకున్నారు. 

" సిరివెన్నెల గారు రాసిన పాటలు ఈ సినిమాకి ప్రాణం పోశాయి. అన్ని పాటలు ఆయన రాస్తున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. అలా ఎక్కువ రోజులు పాటు ఆయనకి సన్నిహితంగా ఉండే అవకాశం నాకు లభించింది. తనకి డబ్బులు వస్తున్నాయి గదా అని సిరివెన్నెల ఎలా అంటే అలా పాటలు రాసేవారు కాదు. ఏదైనా ఒక సందర్భంలో అక్కడ పాట ఇమడదు అనిపిస్తే ఆ విషయాన్ని వెంటనే చెప్పేసేవారు. కథను పాటలో అందంగా చెప్పడం నిజంగా ఆయన గొప్పతనమే" అంటూ ఆయన సిరివెన్నెలను తలచుకున్నారు. 

ఇక త్రివిక్రమ్ మాట్లాడుతూ .. "ఈ సినిమాకి సంబంధించిన ఒక ప్రివ్యూను రామానాయుడిగారి ఫ్యామిలీ కోసం వేశాము. అప్పుడు మీరు .. నేను .. విజయ్ భాస్కర్ గారు కూడా ఉన్నాము. సినిమా చూసిన తరువాత వెంకటేశ్ గారి శ్రీమతి ఒక మాట చెప్పారు. 'ఇప్పుడు మనమందరం కూడా ఎప్పుడు మనసు బాగో లేకపోయినా ఎలా 'గుండమ్మ కథ'ను చూస్తున్నామో, నెక్స్ట్ జనరేషన్ వాళ్లు కూడా మళ్లీ మళ్లీ  ఈ సినిమాను చూస్తారు' అని అన్నారు. ఇప్పుడు అందరూ ఆ మాటనే అంటూ ఉంటే, వెంకటేశ్ గారి శ్రీమతి ఆ రోజున చెప్పిన మాటలే నాకు గుర్తుకు వస్తుంటాయి" అని అన్నారు.



More Telugu News