ఆ మూడు ఘటనలపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వివరణ

  • ఆలయాల్లో అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరిక
  • సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అధికారులకు దిశానిర్దేశం
  • ద్రాక్షారామం శివలింగం ధ్వంసం కేసులో నిందితుడి అరెస్ట్
  • నంద్యాల ఆలయంలో వెండి వస్తువుల మాయంపై విచారణాధికారి నియామకం
  • సింహాచలంలో భక్తుడి పట్ల దురుసుగా ప్రవర్తించిన సిబ్బందిపై ఎఫ్ఐఆర్
రాష్ట్రంలోని దేవాలయాల్లో ఎలాంటి అక్రమాలు, అపచారాలు జరిగినా ఉపేక్షించేది లేదని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఆలయాల పవిత్రతకు భంగం కలిగించేలా ఎవరు ప్రవర్తించినా, వారు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇటీవల రాష్ట్రంలోని ద్రాక్షారామం, సింహాచలం, నంద్యాల ఆలయాల్లో చోటుచేసుకున్న వరుస ఘటనలపై బుధవారం ఆత్మకూరులో మీడియాతో మాట్లాడుతూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయా ఘటనలపై వెంటనే స్పందించి చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. 

ఈ సందర్భంగా మూడు ప్రధాన ఘటనలపై తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. కోనసీమ జిల్లా ద్రాక్షారామం భీమేశ్వరాలయం వెలుపల ఉన్న శివలింగాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి అరెస్ట్ చేశామని, ఆలయ సిబ్బందిపై కక్షతోనే ఆ వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిపారు. అక్కడ వెంటనే నూతన శివలింగాన్ని ప్రతిష్టించినట్లు పేర్కొన్నారు.

అలాగే, నంద్యాల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వెండి వస్తువుల స్థానంలో నకిలీవి పెట్టిన వ్యవహారంపై కర్నూలు డిప్యూటీ కమిషనర్‌తో విచారణ జరిపిస్తున్నామని, బాధ్యుల నుంచి వెండి ఆభరణాలను రికవరీ చేస్తామని స్పష్టం చేశారు. 

ఇక సింహాచలం అప్పన్న ప్రసాదంలో పురుగు వచ్చినట్లు ఫిర్యాదు చేసిన భక్తుడి పట్ల దురుసుగా ప్రవర్తించిన ఉద్యోగిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించామని వెల్లడించారు. ఆలయాల పరిరక్షణ, భక్తుల భద్రతే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ముక్కోటి ఏకాదశి నాడు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గుర్తు చేశారు.


More Telugu News