Nara Lokesh: లోకేశ్ మార్క్: విద్య, ఐటీ, నైపుణ్యంలో ఏపీ దూకుడు

Nara Lokesh Spearheads APs Education IT and Skill Revolution
  • రికార్డు సమయంలో 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ పూర్తి
  • అమరావతిలో క్వాంటం వ్యాలీ, గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు అడుగులు
  • రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తున్న ఐటీ శాఖ
  • 4 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ, 1.45 లక్షల మందికి ఉద్యోగాలు
  • విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు.. కేంద్రం ప్రశంసలు
  • అంతర్జాతీయంగా ఏపీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు
ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. మంత్రి నారా లోకేశ్ సారథ్యంలో ఈ మూడు కీలక శాఖల్లో అమలు చేస్తున్న సంస్కరణలు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాయి. ఒకవైపు విద్యావ్యవస్థను బలోపేతం చేస్తూనే, మరోవైపు భారీ పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు రాష్ట్ర విద్యావ్యవస్థను దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మంత్రి లోకేశ్ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఐదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ, కేవలం 150 రోజుల రికార్డు సమయంలో 16,347 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీని విజయవంతంగా పూర్తిచేశారు. 

పైరవీలకు తావులేకుండా 'టీచర్ ట్రాన్స్‌ఫర్ యాక్ట్' ద్వారా పారదర్శకంగా బదిలీలు చేపట్టారు. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు 'నో బ్యాగ్ డే', క్రీడలు, జీవన నైపుణ్యాలపై దృష్టి సారించారు. ఉపాధ్యాయులపై భారం మోపిన 45 యాప్‌లను తొలగించి, ఒకే యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. 

రాష్ట్రంలో అమలు చేస్తున్న 'లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్' (LEAP) వంటి కార్యక్రమాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైతం ప్రశంసలు కురిపించారు. వీటితో పాటు, రాజకీయాలకు అతీతంగా విద్యార్థులకు 'సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర' పేరుతో విద్యా కిట్లను అందించారు.

ఐటీ, ఎలక్ట్రానిక్స్‌లో భారీ పెట్టుబడులు ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతోంది. అమరావతిలో 'క్వాంటం వ్యాలీ' ఏర్పాటుకు శ్రీకారం చుట్టగా, దీని కోసం క్వాంటం కంప్యూటింగ్ టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. టీసీఎస్, కాగ్నిజెంట్, డైకిన్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. 

ముఖ్యంగా, రూ.87,520 కోట్ల భారీ పెట్టుబడితో రైడెన్ ఇన్ఫోటెక్ (గూగుల్) డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏకంగా రూ.1.22 లక్షల కోట్ల విలువైన 52 అవగాహన ఒప్పందాలు (MoU) కుదిరాయి. దీని ద్వారా 2.32 లక్షల మందికి ఉపాధి లభించనుందని అంచనా.

నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన విద్యా, ఐటీ రంగాలకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు నైపుణ్యాభివృద్ధి శాఖ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఏడాది 4.10 లక్షల మంది యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వగా, వారిలో 1.45 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,483 జాబ్ మేళాలు నిర్వహించి 99,665 ఉద్యోగ అవకాశాలు కల్పించారు. 

అంతర్జాతీయంగా ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (OMCAP) ద్వారా జర్మనీ, జపాన్ వంటి దేశాలకు నర్సులు, ఇంజనీర్లను పంపే కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయి. ఐటీఐలు, పాలిటెక్నిక్‌లను ఆధునికీకరించి పరిశ్రమలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. అభ్యర్థుల నుంచి ఉపాధి కల్పన వరకు అన్ని సేవలను ఒకేచోట అందించేందుకు 'నైపుణ్యం' పేరుతో ఏఐ-ఆధారిత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది.
Nara Lokesh
Andhra Pradesh
Education
IT Development
Skill Development
Mega DSC
Quantum Valley
Job Melas
AP Education
AP IT Sector

More Telugu News