Sajjanar: కొత్త సంవత్సరం వేడుకలు.. మందుబాబులకు సీపీ సజ్జనార్ హెచ్చరిక

Sajjanar Warns Drinkers During New Year Celebrations
  • మద్యం తాగి వాహనాలతో రోడ్లపైకి వస్తే ఉపేక్షించేది లేదన్న సజ్జనార్
  • భారీ జరిమానాతో పాటు వాహనాలను జప్తు చేస్తామని హెచ్చరిక
  • ర్యాష్ డ్రైవింగ్, న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్న సజ్జనార్
మద్యం సేవించి వాహనాలతో రోడ్లపైకి వస్తే ఉపేక్షించేది లేదని, అలాంటి వాహనాలను జప్తు చేస్తామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో సజ్జనార్ మద్యం సేవించి వాహనాలు నడిపేవారికి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి కీలక సూచనలు జారీ చేశారు. నగరంలోని 120 ప్రాంతాల్లో ఈ రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని అన్నారు.

మద్యం తాగి పట్టుబడితే భారీ జరిమానా విధించడంతో పాటు వాహనాలను జప్తు చేస్తామని స్పష్టం చేశారు. జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అతివేగంగా, ప్రమాదకరంగా వాహనాలు నడపడం, బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. నూతన సంవత్సరం వేడుకలను ఒక మధుర జ్ఞాపకంగా మలుచుకోవాలని, విషాదంగా మార్చుకోవద్దని హితవు పలికారు.

భారీ వాహనాలపై నిషేధం

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. భారీ వాహనాల ప్రవేశంపై ఈ రాత్రి నుంచి నిషేధం అమలులోకి వస్తుంది. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డులో వాహనాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు.

ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మహిళల భద్రతకు షీ టీమ్స్ విధుల్లో ఉండనున్నాయి.
Sajjanar
Hyderabad
New Year
Drink and Drive
Traffic Rules
Police
Cyberabad
Rachakonda

More Telugu News