YS Sharmila: వైఎస్ఆర్ తెచ్చిన స్కీమ్‌కు.. మోదీ తెచ్చిన చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది: షర్మిల

YS Sharmila Criticizes Modis MGNREGA Changes
  • ఉమ్మడి ఏపీలో వైఎస్ హయాంలోనే ఉపాధి చట్టానికి బీజం పడిందన్న షర్మిల
  • నరేగా చట్టాన్ని మార్చి కేంద్రం పేదల పొట్టకొడుతోందంటూ ఫైర్
  • గ్రామసభల నిర్ణయాధికారాన్ని ఢిల్లీ చేతుల్లో పెట్టడం అన్యాయం అని ఆవేదన
  • వీబీ జీ రామ్ జీ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్
  • అన్ని జిల్లాల్లో భారీ ఎత్తున నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGA)లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కృషితో, కాంగ్రెస్ హయాంలో ఈ చట్టానికి బీజం పడిందని, దేశానికే ఆదర్శంగా నిలిచిన ఈ పథకాన్ని ప్రధాని మోదీ నిర్వీర్యం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

గత 20 ఏళ్లలో ఉపాధి హామీ ద్వారా రాష్ట్రానికి లక్షల కోట్లు నిధులు వచ్చాయని, పేదలకు అండగా నిలిచిన ఈ పథకానికి మోదీ ప్రభుత్వం 'వీబీ జీ రామ్ జీ' పేరుతో తీసుకొచ్చిన కొత్త చట్టం తూట్లు పొడుస్తోందని షర్మిల విమర్శించారు. కాంగ్రెస్ తెచ్చిన చట్టానికి, బీజేపీ తెచ్చిన కొత్త చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఎద్దేవా చేశారు. 

కొత్త చట్టం ప్రకారం ఉపాధిని హక్కుగా కాకుండా, కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా మార్చారని ఆమె మండిపడ్డారు. గ్రామసభలకు ఉండాల్సిన నిర్ణయాధికారాన్ని ఢిల్లీ చేతుల్లో పెట్టారని, 100 రోజుల పని దినాలను కుదించి, నిధుల భారాన్ని రాష్ట్రాలపై మోపడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏడాదికి 60 రోజులు పని లేకుండా చేయడం, ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే పనులు కల్పించడం వంటి నిబంధనలు పేదలకు అన్యాయం చేయడమేనని షర్మిల పేర్కొన్నారు. కార్పొరేట్ శక్తులకు, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్రం ఈ కొత్త విధానాన్ని తెచ్చిందని విమర్శించారు. ఈ 'నల్లచట్టాన్ని' వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఏపీసీసీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆమె ప్రకటించారు. ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, ఇతర పార్టీలను కలుపుకుని ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
YS Sharmila
MGNREGA
YSR
Andhra Pradesh
Congress
Modi
employment guarantee scheme
rural employment
NREGA funds
APCC

More Telugu News