Gorantla Butchaiah Chowdary: కొడాలి నాని, వల్లభనేని వంశీ నా మాట వినలేదు.. అందుకే ఈ కష్టాలు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
- విభజన సమస్యలను జగన్, కేసీఆర్ పరిష్కరించలేకపోయారన్న బుచ్చయ్య
- కేసీఆర్ తనకంటే జూనియర్ అని వ్యాఖ్య
- జగన్ ఒక డిక్టేటర్ అని విమర్శ
రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు. ఏపీ మాజీ సీఎం జగన్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఏపీ, తెలంగాణ మధ్య పెండింగ్లో ఉన్న విభజన సమస్యలకు కేసీఆర్, జగన్ ప్రధాన కారణమని దుయ్యబట్టారు. కేసీఆర్ తనకంటే జూనియర్ అని, జగన్ డిక్టేటర్ అని విమర్శించారు. వీరిద్దరూ ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో విభజన సమస్యలను పరిష్కరించలేకపోయారని మండిపడ్డారు. గోదావరి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ హఠాత్తుగా రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొనసాగుతోందని... కూటమి ప్రభుత్వం అన్ని సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగుతోందని బుచ్చయ్య చౌదరి తెలిపారు. విభజన సమస్యలు కొనసాగకుండా ఉండాలంటే నాయకత్వం సమర్థవంతంగా ఉండాలని, అది టీడీపీకే సాధ్యమని అన్నారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి వైసీపీ చేసిందేమీ లేదని విమర్శించారు. ఉద్యోగాల కల్పన, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమల విషయంలో ప్రజలను తీవ్రంగా నిరాశపరిచిందని చెప్పారు. గతంలో వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి నేతలు తన సలహాలను వినకపోవడం వల్లే ఇప్పుడు వారు చట్టపరమైన, రాజకీయపరమైన పరిణామాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు.