దంచికొట్టిన సర్ఫరాజ్ ఖాన్.. 14 సిక్సర్లతో వీరవిహారం

  • విజయ్ హజారే ట్రోఫీలో సర్ఫరాజ్ ఖాన్ 157 పరుగుల భారీ ఇన్నింగ్స్
  • 56 బంతుల్లోనే సెంచరీ.. తుపాన్ ఇన్నింగ్స్‌లో 14 సిక్సర్లు, 9 ఫోర్లు
  • తమ్ముడు ముషీర్ ఖాన్‌తో కలిసి కీలక భాగస్వామ్యం
  • బౌలింగ్‌లో నిరాశపరిచిన అర్జున్ టెండూల్కర్
దేశవాళీ క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 2025 సంవత్సరం చివరి రోజైన నేడు గోవా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అలరించాడు. కేవలం బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతూ 75 బంతుల్లోనే 157 పరుగుల భారీ వ్యక్తిగత స్కోరు సాధించాడు.

ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ముంబై జట్టులో.. యశస్వి జైస్వాల్ (46) ఔటైన తర్వాత నాలుగో స్థానంలో సర్ఫరాజ్ క్రీజులోకి వచ్చాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సర్ఫరాజ్ కేవలం 56 బంతుల్లోనే తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత వేగంగా ఆడుతూ 150 పరుగుల మార్కును దాటాడు. అత‌ని ఇన్నింగ్స్‌లో ఏకంగా 14 సిక్సర్లు, 9 ఫోర్లు ఉండ‌టం విశేషం. తమ్ముడు ముషీర్ ఖాన్‌తో కలిసి 10 ఓవర్లలోనే 93 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 209.33 స్ట్రైక్ రేట్‌తో సర్ఫరాజ్ చేసిన బ్యాటింగ్ విన్యాసంతో ముంబై జట్టు నిర్ణీత ఓవర్లలో 444 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. 

ముంబైపై అర్జున్ టెండూల్కర్ విఫలం
మరోవైపు గోవా తరఫున ఆడుతున్న అర్జున్ టెండూల్కర్ తన సొంత జట్టు ముంబైపై ఆడిన తొలి మ్యాచ్‌లో నిరాశపరిచాడు. బౌలింగ్‌లో దారుణంగా విఫలమైన అర్జున్.. 7 ఓవర్లు వేసి వికెట్లేమీ తీయకుండా 62 పరుగులు సమర్పించుకున్నాడు. 


More Telugu News