మస్క్ మాస్టర్ ప్లాన్.. ఏఐ కంప్యూటింగ్ కెపాసిటీ ఇక 2 గిగావాట్లు

  • మెమ్ఫిస్ సమీపంలో మూడో భవనాన్ని కొనుగోలు చేసిన మస్క్ ఎక్స్‌ఏఐ
  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటింగ్ సామర్థ్యం 2 గిగావాట్లకు పెంపు
  • కొత్త భవనానికి ‘మాక్రోహార్డర్’ అని వినూత్న పేరు పెట్టిన మస్క్
  • ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ అయ్యే దిశగా మస్క్ అడుగులు
టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తన ఏఐ సామ్రాజ్యాన్ని మరింత వేగంగా విస్తరిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామిగా నిలిచేందుకు ఆయన స్థాపించిన 'ఎక్స్‌ఏఐ' (xAI) సంస్థ తాజాగా అమెరికాలో మరో భారీ భవనాన్ని కొనుగోలు చేసింది. ఇప్పటికే మెమ్ఫిస్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ.. అక్కడికి సమీపంలోనే మూడో భవనాన్ని కూడా సొంతం చేసుకుంది. 

ఈ కొత్త భవనానికి 'మాక్రోహార్డర్' (Macrohardrr) అని పేరు పెట్టినట్లు మస్క్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ఈ కొనుగోలుతో తమ ఏఐ ట్రైనింగ్ కంప్యూటింగ్ సామర్థ్యం దాదాపు 2 గిగావాట్లకు చేరుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా ఒక గిగావాట్ విద్యుత్ సుమారు 7.5 లక్షల ఇళ్లకు సరిపోతుంది. దీన్ని బట్టి మస్క్ ఏఐ డేటా సెంటర్ల సామర్థ్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

మిసిసిపీలోని సౌత్‌హెవెన్‌లో ఉన్న ఈ కొత్త భవనం.. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న 'కొలోసస్ 2' ఫెసిలిటీకి ఆనుకుని ఉంది. ఇప్పటికే మస్క్ మెమ్ఫిస్‌లో 'కొలోసస్' పేరుతో ఒక డేటా సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను నిర్మించాలన్నది మస్క్ లక్ష్యం. ఇందులో భాగంగా భవిష్యత్తులో 5,50,000 ఎన్విడియా చిప్‌లను వినియోగించనున్నట్లు ఆయన గతంలోనే ప్రకటించారు.

మరోవైపు, ఎక్స్‌ఏఐ సంస్థ విలువను 230 బిలియన్ డాలర్లుగా లెక్కగడుతూ భారీగా నిధుల సమీకరణకు మస్క్ చర్చలు జరుపుతున్నారు. ఇటీవల కోర్టు తీర్పుతో టెస్లా స్టాక్ ఆప్షన్లు తిరిగి మస్క్ చేతికి రావడంతో.. ఆయన సంపద ఏకంగా 750 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా అవతరించే దిశగా మస్క్ దూసుకుపోతున్నారని ఫోర్బ్స్ అంచనా వేసింది. ఇదే సమయంలో వికీపీడియాపై మస్క్ మరోసారి సెటైర్లు వేశారు. వికీపీడియా పక్షపాత ధోరణితో ఉందని, దానికి ప్రత్యామ్నాయంగా తాము తీసుకొస్తున్న 'గ్రోక్‌పీడియా' మరింత కచ్చితత్వంతో, విస్తృత సమాచారంతో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.


More Telugu News