చైనాకు షాకిచ్చిన భారత్.. స్టీల్ దిగుమతులపై పన్ను

  • చైనా నుంచి దిగుమతయ్యే చౌక ఉత్పత్తులే టార్గెట్
  • కొన్ని రకాల స్టీల్ ఉత్పత్తులపై 12 శాతం టారిఫ్ విధించిన కేంద్రం
  • దేశీయ ఉక్కు తయారీదారుల ప్రయోజనాలను కాపాడేందుకేనని వెల్లడి
స్టీలు ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న భారత్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. స్టీలు దిగుమతులపై పన్ను విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. చైనా నుంచి దిగుమతి అవుతున్న చౌక స్టీలు ఉత్పత్తులే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి.. ముఖ్యంగా చైనా నుంచి దిగుమతి అవుతున్న పలు చౌక స్టీలు ఉత్పత్తులపై 12 శాతం పన్ను విధించింది. స్టెయిన్‌లెస్‌ స్టీల్ వంటి ప్రత్యేక ఉక్కు ఉత్పత్తులకు కూడా ఇది వర్తిస్తుంది.

దేశీయంగా ఉక్కు తయారీదారుల ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకున్న ఈ నిర్ణయంతో చైనాకు షాక్ తగలనుంది. అక్కడి నుంచి మన దేశానికి దిగుమతయ్యే వస్తువులు తగ్గనున్నాయి. చైనా, వియత్నాం, నేపాల్‌ దేశాలకు ఈ సుంకాలు వర్తించనుండగా పలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు కేంద్రం మినహాయింపు ప్రకటించింది.

కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. స్టీలు ఉత్పత్తులపై దిగుమతి సుంకం మూడేళ్ల పాటు అమలులో ఉంటుంది. తొలి ఏడాది 12 శాతం పన్ను, రెండో ఏడాది 11.5 శాతం, మూడో ఏడాది 11 శాతం పన్ను వసూలు చేయనున్నట్లు పేర్కొంది.

డీజీటీఆర్ సిఫార్సుతోనే నిర్ణయం..
స్టీల్‌ దిగుమతులు గణనీయంగా పెరగడంతో దేశీయ పరిశ్రమలకు తీవ్ర నష్టం కలుగుతోందని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ట్రేడ్‌ రెమిడీస్‌ (డీజీటీఆర్) తెలిపింది. దీంతో దిగుమతి సుంకం విధించాలంటూ కేంద్రానికి సిఫార్సు చేయగా.. ఆర్థిక శాఖ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


More Telugu News