తిరుమల కల్తీ నెయ్యి కేసులో టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిని సుదీర్ఘంగా ప్రశ్నించిన సిట్

  • నెల్లూరులోని ప్రశాంతి నివాసంలో సిట్ అధికారుల విచారణ
  • గతంలో నాలుగు నెలల పాటు టీటీడీ కొనుగోళ్ల కమిటీ సభ్యురాలిగా ఉన్న ప్రశాంతి
  • టీటీడీ కొనుగోళ్లపై తనకు పూర్తి అవగాహన లేదని చెప్పిన ఎమ్మెల్యే

కల్తీ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. ఈ కేసులో భాగంగా టీటీడీ పాలకమండలి సభ్యురాలు, నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిని సిట్ అధికారులు విచారించారు. తిరుపతి నుంచి ప్రత్యేక బృందంగా నెల్లూరులోని ఆమె నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు రోజంతా సుదీర్ఘంగా ప్రశ్నలు సంధించారు. టీటీడీలో ఆమె నిర్వహించిన బాధ్యతలు, అప్పటి కొనుగోళ్ల విధానాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.


వైసీపీ ప్రభుత్వ హయాంలో నాలుగు నెలల పాటు ప్రశాంతి టీటీడీ కొనుగోళ్ల కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆ సమయంలో కమిటీ ఎలా పనిచేసేది, కొనుగోళ్లపై ఎవరి నిర్ణయాలు ఉండేవి, సభ్యుల పాత్ర ఏమిటన్న అంశాలపై సిట్ అధికారులు వివరాలు సేకరించారు. ముఖ్యంగా అప్పట్లో నెయ్యి సరఫరాకు సంబంధించి ఏమైనా అనుమానాలు, ఫిర్యాదులు మీ దృష్టికి వచ్చాయా? అనే ప్రశ్నలు వేసినట్లు సమాచారం.


ఈ అంశాలపై స్పందించిన ప్రశాంతి... తాను కేవలం నాలుగు నెలలపాటు మాత్రమే పర్చేజ్ కమిటీలో ఉన్నానని, టీటీడీ కొనుగోళ్ల వ్యవహారాలపై పూర్తిస్థాయి అవగాహన తనకు లేదని చెప్పినట్లు తెలిసింది. ఆరున్నరేళ్ల కింద జరిగిన విషయాలను ఇప్పుడు గుర్తు చేసుకోవడం కష్టమని కూడా ఆమె వ్యాఖ్యానించినట్లు సమాచారం. నెయ్యి సరఫరాలో అవకతవకల గురించి అప్పట్లో తనకు ఎలాంటి సమాచారం అందలేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.


ఇదే కేసులో ఇప్పటికే పలువురు కీలక నేతలను సిట్ విచారించిన సంగతి తెలిసిందే. టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలను విచారించిన అధికారులు, లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న అప్పటి టీటీడీ ఎక్స్‌అఫిషియో సభ్యుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని కూడా జైలులోనే ప్రశ్నించారు.


కల్తీ నెయ్యి వ్యవహారం టీటీడీ ప్రతిష్ఠకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో, ఈ కేసులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా లోతైన విచారణ జరుపుతామని సిట్ అధికారులు స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. ఈ దర్యాప్తులో ఇంకా ఎవరెవరి పేర్లు వెలుగులోకి వస్తాయన్న ఉత్కంఠ నెలకొంది.



More Telugu News