మనిషి మెదడు చేసే పనులను కూడా ఏఐ చేయడం మొదలుపెట్టింది: ఏఐ గాడ్‌ఫాదర్‌ హింటన్‌ హెచ్చరిక

  • 2025లో ఏఐ ఏ స్థాయికి చేరిందో చూశామన్న హింటన్
  • వచ్చే ఏడాది నిరుద్యోగం తీవ్ర స్థాయికి చేరుతుందని హెచ్చరిక
  • ఇప్పుడు ఏఐ కేవలం సపోర్టింగ్ టూల్ మాత్రమే కాదన్న హింటన్

కృత్రిమ మేధ (ఏఐ) పూర్తి స్థాయిలో పని చేయడానికి ఇంకా చాలా సమయం పడుతుంది అనుకునే వారికి ఇది కాస్త ఆలోచించాల్సిన హెచ్చరికే. ప్రపంచవ్యాప్తంగా ‘ఏఐ గాడ్‌ఫాదర్’గా పేరొందిన జెఫ్రీ హింటన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. 2025లోనే ఏఐ సామర్థ్యం ఏ స్థాయికి చేరిందో మనం చూసేశామని, ఈ వేగం ఇలాగే కొనసాగితే 2026 ప్రారంభంలోనే ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని ఆయన స్పష్టంగా హెచ్చరించారు.


ప్రస్తుతం ఏఐ కేవలం సపోర్టింగ్ టూల్‌గా మాత్రమే కాకుండా, మనిషి మెదడు చేసే పనులను కూడా చేయడం మొదలుపెట్టిందని హింటన్ తెలిపారు. ముఖ్యంగా వైట్‌-కాలర్ ఉద్యోగాలు అంటే ఆలోచన, రచన, డేటా విశ్లేషణ, నిర్ణయాలు తీసుకునే పనులు చేసే ఉద్యోగాలు ఎక్కువ ముప్పులో ఉన్నాయని చెప్పారు. ఒకప్పుడు ఇవి పూర్తిగా మనుషులకే సాధ్యమని భావించేవాళ్లం. కానీ ఇప్పుడు అదే పనిని ఏఐ వేగంగా, తక్కువ ఖర్చుతో చేయగలుగుతోందని ఆయన పేర్కొన్నారు. దీని వల్ల కంపెనీలు ఉద్యోగులను తగ్గించి, తక్కువ మంది సిబ్బందితోనే ఎక్కువ పని చేయించుకునే దిశగా వెళ్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.


కరోనా తర్వాత ఇప్పటికే చాలా కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడంపైనే దృష్టి పెట్టాయి. అలాంటి సమయంలో ఏఐ రావడం వారికి మరింత అవకాశంగా మారిందని ఆర్థిక నిపుణుల అభిప్రాయం. ఉత్పాదకత పెరిగే అవకాశం ఉన్నా, అదే స్థాయిలో కొత్త ఉద్యోగాలు సృష్టి కాకపోవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీని ఫలితంగా నిరుద్యోగం పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.


అయితే పూర్తిగా ఆశ కోల్పోవాల్సిన అవసరం లేదని కూడా హింటన్ చెబుతున్నారు. అన్ని రంగాల్లో ఉద్యోగాలు అంతరించిపోవని, ఏఐ అభివృద్ధితో పాటు కొత్త రకాల ఉద్యోగాలు కూడా వస్తాయని తెలిపారు. ముఖ్యంగా ఏఐ వ్యవస్థలను రూపొందించడం, పర్యవేక్షించడం, నియంత్రించడం, అలాగే నాయకత్వం, పాలసీ నిర్ణయాలు తీసుకునే రంగాల్లో అవకాశాలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.


ఉద్యోగాల అంశం కన్నా కూడా మరో పెద్ద ప్రమాదం ఉందని జెఫ్రీ హింటన్ హెచ్చరించారు. శక్తిమంతమైన ఏఐ వ్యవస్థలు క్రమంగా మోసపూరిత ప్రవర్తనను కూడా నేర్చుకునే అవకాశముందని చెప్పారు. లాభాల కోసం పరుగెత్తే కొన్ని కంపెనీలు భద్రతా నిబంధనలను పక్కన పెట్టి ఏఐని వినియోగిస్తే, అది సమాజానికి తీవ్రమైన ముప్పుగా మారవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.


మొత్తానికి, ఏఐ మన జీవితాలను సులభతరం చేసే శక్తి ఉన్నప్పటికీ, అదే సమయంలో పెద్ద సవాళ్లను కూడా ముందుకు తెస్తోంది. రానున్న రోజుల్లో ఏఐని ఎలా ఉపయోగించాలి, ఎలా నియంత్రించాలి అన్నదే ప్రభుత్వాలు, కంపెనీలు, సమాజం కలిసి ఆలోచించాల్సిన ప్రధాన అంశంగా మారింది.



More Telugu News