Germany Bank Heist: బ్యాంకుకు కన్నం వేసి రూ.300 కోట్ల చోరీ.. జర్మనీలో ఘటన

Germany Bank Heist 300 Crore Rupees Stolen
  • హాలీవుడ్ సినిమాను తలదన్నే రీతిలో దొంగల స్కెచ్
  • సొరంగం తవ్వి బ్యాంకు లోపలికి ఎంట్రీ.. లాకర్లన్నీ ఊడ్చేసిన దొంగలు
  • క్రిస్మస్ సెలవుల్లో దొంగలు గప్ చుప్ గా పనికానిచ్చేసిన వైనం
జర్మనీలోని ఓ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. వరుస సెలవులతో మూసి ఉన్న బ్యాంకులో దొంగలు పడి సుమారు 300 కోట్ల విలువైన నగలు, నగదు, వస్తువులను ఎత్తుకెళ్లారు. బ్యాంకు పక్కనే ఉన్న పార్కింగ్ గ్యారేజ్ నుంచి సొరంగం తవ్వి బ్యాంకు లోపలికి వెళ్లిన దొంగలు.. 3 వేలకు పైగా లాకర్లను తెరిచి ఖాతాదారులు దాచుకున్న సొమ్మును కాజేశారు. హాలీవుడ్ సినిమా ‘ఓషియన్స్ ఎలెవన్’ సినిమా తరహాలో ఈ చోరీ జరిగింది. జర్మనీ బ్యాంకుల రూల్స్ ప్రకారం.. ఖాతాదారులు తమ లాకర్లకు ఇన్సూరెన్స్ చేయించడం తప్పనిసరి. ఈ ఇన్సూరెన్స్ వివరాల ఆధారంగా 3 వేలకు పైగా లాకర్లలో దాదాపు 300 కోట్ల విలువైన నగలు, వస్తువులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. నార్త్ రైన్-వెస్ట్‌ఫాలియా రాష్ట్రంలోని గెల్సెన్‌కిర్చెన్ సిటీలో ఈ భారీ దొంగతనం జరిగింది.

బ్యాంకుకు వరుస సెలవులు..
క్రిస్మస్ సందర్భంగా గత గురు, శుక్రవారాలు బ్యాంకుకు సెలవు కాగా శని, ఆదివారాలు జర్మనీలోని బ్యాంకులకు సాధారణ సెలవు దినాలు. దీంతో నాలుగు రోజులు బ్యాంకు మూసి ఉంది. ఈ సమయాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్న దొంగలు.. పక్కాగా ప్లాన్ చేసి భారీ పనిముట్లతో రంగంలోకి దిగారు. గ్యారేజ్ లో నుంచి బ్యాంకులోకి సొరంగం తవ్వారు. లోపలికి వెళ్లి లాకర్ రూంలోని 3,250 లాకర్లలో 3 వేలకు పైగా లాకర్లను తెరిచారు. అందులోని విలువైన వస్తువులు, నగలను ఎత్తుకెళ్లారు.

సోమవారం ఉదయం వెలుగులోకి..
సోమవారం ఉదయం ఫైర్ అలారం మోగడంతో బ్యాంకులో చోరీ విషయం బయటపడింది. ఈ చోరీ విషయం తెలిసి వందలాది మంది ఖాతాదారులు బ్యాంకు వద్దకు చేరుకున్నారు. అయితే, పోలీసులు దర్యాప్తు చేస్తుండడంతో బ్యాంకును అధికారులు మూసివేశారు. కాగా, శుక్రవారం ఉదయం బ్యాంకు పక్కనే ఉన్న గ్యారేజ్ లో నుంచి కొంతమంది ముసుగులు ధరించిన వ్యక్తులు ఆడి కారులో వెళ్లడం చూసినట్లు స్థానికులు తెలిపారు. దీంతో పోలీసులు ఆరా తీయగా.. దొంగలు పక్కా ప్లాన్ తో ముందుగా ఒక కారును దొంగిలించి, దానిని ఉపయోగించి బ్యాంకులో చోరీకి పాల్పడ్డారని తేలింది.
Germany Bank Heist
Bank Heist
Germany
Gelsenkirchen
North Rhine-Westphalia
Bank robbery
Oceans Eleven
Crime
Insurance
Parking Garage

More Telugu News