Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ 2025: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రత్యేక కథనం

Andhra Pradesh Progress Report 2025
  • 2025లో 11.28 శాతం ఆర్థిక వృద్ధిరేటు
  • సూపర్ సిక్స్ పథకాల ద్వారా కోట్లాది మందికి సంక్షేమ ఫలాలు, నేరుగా నగదు బదిలీ
  • విశాఖ సీఐఐ సదస్సు ద్వారా రూ.13.25 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల ఒప్పందాలు
  • మెగా డీఎస్సీ, పోలీస్ నియామకాలతో యువతకు ప్రభుత్వ ఉద్యోగాల కల్పన
  • అమరావతి, పోలవరం పనుల్లో పురోగతి, గ్రామీణ మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి
  • సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా 2026లో మరిన్ని కార్యక్రమాలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం
2024లో చారిత్రక తీర్పుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి తొలి ఆరు నెలలు వ్యవస్థలను చక్కదిద్దడానికే సరిపోయింది. ఆర్థికంగా, పరిపాలనపరంగా ఎదురైన సవాళ్లను అధిగమించి, 2025లో రాష్ట్రం ఒక స్పష్టమైన అభివృద్ధి బాట పట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ, విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి ప్రగతి పథంలో నడిపించేందుకు ఈ ఏడాదిని ఒక వేదికగా మార్చుకుంది. ఒకవైపు ప్రజల తక్షణ అవసరాలను తీర్చే సంక్షేమ పథకాలు, మరోవైపు రాష్ట్ర భవిష్యత్తుకు పునాదులు వేసే దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను ఏకకాలంలో అమలు చేయడం 2025లో ప్రభుత్వ పాలనలో కనిపించిన ప్రధాన లక్షణం. ఈ క్రమంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధిరేటు 11.28 శాతానికి చేరడం విశేషం.

సంక్షేమానికి చిరునామా: 'సూపర్ సిక్స్' సూపర్ హిట్

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలే లక్ష్యంగా, కూటమి ప్రభుత్వం 'సూపర్ సిక్స్' పథకాలను ఈ ఏడాది విజయవంతంగా అమలు చేసింది. ఈ పథకాల ద్వారా కోట్లాది మంది ప్రజలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరింది.

సామాజిక భద్రత పింఛన్లు: పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం ఈ ఏడాది ఒక మైలురాయిని దాటింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా 31 విభాగాల లబ్ధిదారులకు పెంచిన పింఛన్లతో కలిపి ఇప్పటివరకు మొత్తం ₹50 వేల కోట్ల పంపిణీ పూర్తి చేసింది. ఇది రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డు. 

తల్లికి వందనం: రాష్ట్రంలో విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పథకం కింద 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం ₹10,090 కోట్లు జమ చేసింది. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి ఆర్థికంగా అండగా నిలవడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఒక కుటుంబంలో ఎంతమంది అర్హులైన పిల్లలున్నా, అందరికీ ఈ పథకం వర్తింపజేయడం విశేషం. 

మహిళా శక్తి (ఉచిత బస్సు ప్రయాణం): ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు మహిళలు 3.25 కోట్ల ఉచిత ప్రయాణాలు చేయగా, ప్రభుత్వంపై ₹1,144 కోట్ల భారం పడింది. దివ్యాంగులకు కూడా ఈ సౌకర్యాన్ని వర్తింపజేశారు.

అన్నదాత సుఖీభవ: రైతన్నలకు అండగా నిలిచేందుకు 46 లక్షల మంది రైతుల ఖాతాల్లో ₹6,310 కోట్లు జమ చేశారు. ఇది కేంద్రం ఇచ్చే సాయానికి అదనం.

దీపం-2: పేద మహిళలపై గ్యాస్ భారాన్ని తగ్గించేందుకు ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా అందించే పథకాన్ని ప్రారంభించారు. దీనికోసం ₹2,684 కోట్లు వెచ్చించి, దాదాపు 2 కోట్ల సిలిండర్లను పంపిణీ చేశారు.

వీటితో పాటు వివిధ వర్గాలకు ప్రత్యేక పథకాలను అమలు చేశారు. మత్స్యకార భరోసా కింద 1.25 లక్షల మందికి ₹250 కోట్లు, ఆటో డ్రైవర్లకు ₹436 కోట్లు అందించారు. పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజన్‌లు, పురోహితులకు గౌరవ వేతనాలను పెంచారు. దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు నెలకు ₹25,000, జూనియర్ లాయర్లకు ₹10,000 గౌరవ వేతనం అందిస్తున్నారు. నేతన్నలకు ఉచిత విద్యుత్, గీత కార్మికులకు మద్యం షాపుల్లో రిజర్వేషన్లు కల్పించారు. గతంలో మూతపడిన 204 అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించి, 4 కోట్ల భోజనాలను అందించారు.

కొలువుల జాతర: యువతకు భరోసా

 నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన హామీలో భాగంగా, ప్రభుత్వం ఈ ఏడాది పలు కీలక నియామక ప్రక్రియలను పూర్తి చేసింది.

మెగా డీఎస్సీ: ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించాక పెట్టిన తొలి సంతకాన్ని 2025లో ప్రభుత్వం కార్యరూపంలోకి తెచ్చింది. అనేక అడ్డంకులను అధిగమించి, మెగా డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించి 15,491 మంది ఉపాధ్యాయులను నియమించింది. 

పోలీస్ నియామకాలు: ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియను పూర్తి చేసి, 5,757 మందికి నియామక పత్రాలు అందజేశారు. శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్ల స్టైఫండ్‌ను ₹4,500 నుంచి ₹12,500కు పెంచారు.

వీటితో పాటు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లకు గ్రాట్యుటీని అమలు చేయడం ద్వారా వారి పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించారు.

మరోవైపు, మానవ వనరుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా 3.5 కోట్ల మంది ప్రజల నైపుణ్యాలను అంచనా వేసేందుకు 'స్కిల్ సెన్సస్' నిర్వహించింది. అమరావతి కేంద్రంగా 'రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్'ను, మరో ఐదు నగరాల్లో ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేసి స్టార్టప్‌లను ప్రోత్సహిస్తోంది.

పారిశ్రామిక ప్రగతి: చరిత్రను తిరగరాసే దిశగా

2025 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి ఒక స్వర్ణయుగమనే చెప్పాలి. పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ చొరవతో గూగుల్ 15 బిలియన్ డాలర్ల డేటా సెంటర్, ఆర్సెలర్ మిట్టల్ 17 బిలియన్ డాలర్ల స్టీల్ ప్లాంట్ వంటి భారీ ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయి. 2029 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి లోకేశ్ చేస్తున్న కృషిని రాయిటర్స్ వార్తా సంస్థ ప్రత్యేకంగా ప్రస్తావించింది. 

సీఐఐ సదస్సు: విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలో ఒక మైలురాయి. ఈ సదస్సులో 610 ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా ₹13.25 లక్షల కోట్ల పెట్టుబడులు, 16.13 లక్షల ఉద్యోగాలకు మార్గం సుగమమైంది.

పెట్టుబడులకు ఆమోదం: ఇప్పటివరకు జరిగిన 13 రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశాల్లో ₹8.55 లక్షల కోట్ల పెట్టుబడులు, 8.23 లక్షల ఉద్యోగాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

కొత్త పాలసీలు: పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం 23 కొత్త పాలసీలను రూపొందించింది. పరిశ్రమలకు ఇచ్చే రాయితీలను సకాలంలో అందించేందుకు 'ఎస్క్రో ఖాతాలు' తెరిచిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచింది.

ఐటీ హబ్‌గా విశాఖ: గూగుల్ ఏఐ డేటా సెంటర్, రిలయన్స్ డేటా సెంటర్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రఖ్యాత కంపెనీల రాకతో విశాఖ రూపురేఖలు మారుతున్నాయి. ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.

వికేంద్రీకరణ దిశగా పరిశ్రమలు, టెక్నాలజీ: గతంలో హైదరాబాద్ కేంద్రీకృతంగా ఉన్న పారిశ్రామిక నమూనాకు భిన్నంగా, పరిశ్రమలను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 'ఒక నియోజకవర్గం - ఒక ఇండస్ట్రియల్ పార్క్' విధానాన్ని ప్రకటించింది. దీని కింద ఇప్పటికే 140 నియోజకవర్గాల్లో 100 ఎకరాల చొప్పున భూమిని గుర్తించారు. ఈ ఎంఎస్ఎంఈ పార్కుల్లో యూనిట్లు స్థాపించే స్థానిక పారిశ్రామికవేత్తల కోసం రూ.500 కోట్ల క్రెడిట్ గ్యారెంటీ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. రాయలసీమను టెక్నాలజీ హబ్‌గా మార్చే లక్ష్యంతో కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల్లో 'డ్రోన్ సిటీ' ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇది 40,000 ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా.

బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్: రాష్ట్రంలో 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానాలను అమలు చేస్తూ, పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నందుకుగాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రతిష్ఠాత్మక 'ఎకనమిక్ టైమ్స్' అందించే 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025' అవార్డు లభించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు లభించిన జాతీయ స్థాయి గుర్తింపు.

ప్రాంతీయ సమతుల్యత

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం మూడు ప్రాంతాల అభివృద్ధి వ్యూహాన్ని అమలు చేసింది. విశాఖపట్నాన్ని ఐటీ హబ్‌గా, అమరావతిని క్వాంటం కంప్యూటింగ్ మరియు సెమీకండక్టర్ జోన్‌గా, తిరుపతిని ఎలక్ట్రానిక్స్ మరియు పర్యాటక క్లస్టర్‌గా తీర్చిదిద్దుతోంది. 

అమరావతి పునర్నిర్మాణం 

గత ఐదేళ్లుగా నిర్లక్ష్యానికి గురై, పిచ్చి మొక్కలతో నిండిన అమరావతి రాజధాని ప్రాంతంలో 2025లో నిర్మాణాల హోరు మళ్లీ మొదలైంది. శాసనసభ, సచివాలయం, హైకోర్టు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారుల నివాస సముదాయాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల పనులు ఊపందుకున్నాయి. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు అడుగులు పడటం, రాష్ట్ర భవిష్యత్తుకు సాంకేతిక పునాదులు వేస్తోంది.

పంచాయతీరాజ్,  రోడ్లు, పారిశుధ్యం 

దేవదాయ శాఖ: తిరుమల సహా 15 ప్రధాన ఆలయాల్లో నిత్యాన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు చేపట్టారు.

పంచాయతీరాజ్: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అనేక చర్యలు చేపట్టారు. 'పల్లె పండుగ' ద్వారా గ్రామాల్లో 4,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం, ఒకేరోజు 13,326 గ్రామ సభల నిర్వహణ వంటివి స్థానిక పాలనకు కొత్త ఊపునిచ్చాయి. 'అడవి తల్లి బాట' కార్యక్రమంతో గిరిజన తండాలకు రోడ్ల నిర్మాణం, శివారు గ్రామాలకు 4జీ నెట్‌వర్క్ కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. 95 కేంద్ర ప్రాయోజిత పథకాలను పునరుద్ధరించి, నిధులు రాబట్టారు. 'అమరజీవి జలధార' పేరుతో ₹3,050 కోట్లతో ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇచ్చే బృహత్ ప్రణాళికకు రూపకల్పన చేశారు.

రోడ్లు, పారిశుద్ధ్యం:  'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' నినాదంతో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. అధ్వానంగా మారిన రోడ్ల మరమ్మతుల కోసం ₹1,000 కోట్లు, కొత్త రహదారుల నిర్మాణానికి ₹3,000 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో పేరుకుపోయిన 84 లక్షల టన్నుల చెత్తను తొలగించి, దాని ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఒప్పందాలు చేసుకున్నారు.

వ్యవసాయం, జలవనరులు, భూమి హక్కులు

రైతు సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.

జలయజ్ఞం పునరుద్ధరణ: రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనుల్లోనూ గణనీయమైన పురోగతి కనిపించింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిధులను సమీకరించి, నిర్వాసితులకు ఆర్&ఆర్ ప్యాకేజీ చెల్లింపులను వేగవంతం చేశారు.  హంద్రీనీవా కాలువ విస్తరణ పనులను కేవలం 100 రోజుల్లో పూర్తి చేసి రాయలసీమ సాగు, తాగునీటి కష్టాలను తీర్చడంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రదర్శించింది. 2026 నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ధాన్యం సేకరణ: ఖరీఫ్ సీజన్‌లో 34.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి, 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో ₹8,120 కోట్లు జమ చేశారు. మార్కెట్ జోక్య నిధి ద్వారా పొగాకు, మామిడి, ఉల్లి వంటి పంటలకు మద్దతు ధర కల్పించి, రైతులకు ₹1,100 కోట్లకు పైగా సాయం అందించారు.

రెవెన్యూ సంస్కరణలు: రైతులు, భూ యజమానులలో తీవ్ర ఆందోళన రేకెత్తించిన ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేసింది. వివాదాల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి, లక్షలాది మందికి ఊరట కల్పించింది. "రాజముద్ర"తో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను అందించడం, భూ యజమానుల్లో భద్రతా భావాన్ని పెంచింది.

విద్య, వైద్యం, గృహ నిర్మాణం

మానవ వనరుల అభివృద్ధికి విద్య, వైద్య రంగాలు కీలకమని భావించిన ప్రభుత్వం, ఈ రంగాల్లో పలు సంస్కరణలు చేపట్టింది.

విద్యా రంగం: 'డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం', 'సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లు' వంటి వాటిని ఎలాంటి రాజకీయ నేతల చిత్రాలు లేకుండా విద్యార్థులకు అందించారు. ఉపాధ్యాయుల బదిలీలను అత్యంత పారదర్శకంగా నిర్వహించారు. 75 లక్షల మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు, పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు 'ముస్తాబు' కార్యక్రమాన్ని చేపట్టారు.

వైద్య రంగం: పేద విద్యార్థులకు అదనంగా 110 వైద్య విద్య సీట్లు అందుబాటులోకి తెచ్చేలా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కుప్పంలో గేట్స్ ఫౌండేషన్, టాటా సౌజన్యంతో 'సంజీవని' పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. 'డిజి హెల్త్ కేర్', 'యూనివర్సల్ హెల్త్ పాలసీ' వంటి విప్లవాత్మక విధానాలకు రూపకల్పన చేశారు.

గృహ ప్రవేశాలు: నిర్మాణం పూర్తయిన 3 లక్షల ఇళ్లల్లో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించి, లబ్ధిదారులకు తాళాలు అందజేశారు. ఇళ్లు లేని పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున స్థలాలు ఇచ్చేందుకు దరఖాస్తులు స్వీకరించారు.

శాంతిభద్రతలు, ధరలు,  మౌలిక సంస్కరణలు

శాంతిభద్రతలు: గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలను అరికట్టేందుకు 'ఈగల్ టాస్క్ ఫోర్స్'ను ఏర్పాటు చేశారు. ఇది సత్ఫలితాలనివ్వడంతో పాటు, రాష్ట్రంలో నేరాల రేటు తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ధరలు: నిత్యావసరాల ధరలు సామాన్యుడికి భారంగా మారకుండా చర్యలు చేపట్టింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా పొగాకు, మామిడి, ఉల్లి వంటి పంటలకు మద్దతు ధర కల్పించి రైతులకు, వినియోగదారులకు ఊరటనిచ్చింది. విద్యుత్ రంగంలో గత ప్రభుత్వం పెంచిన ఛార్జీల భారాన్ని తగ్గిస్తూ, తొలిసారిగా "ట్రూ డౌన్" అమలు చేసింది. విద్యుత్ కొనుగోలు ధరలను తగ్గించడం ద్వారా యూనిట్ ధరను రూ.5.19 నుంచి రూ.4.80కి తగ్గించేలా చర్యలు చేపట్టింది. 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్ రూఫ్ టాప్ పథకాన్ని ప్రకటించడం క్లీన్ ఎనర్జీ దిశగా వేసిన మరో ముందడుగు.

జిల్లాలు, ప్రణాళికలు: పాలనా సౌలభ్యం కోసం మరో రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాల సంఖ్య 28కి పెరిగింది. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా 3 రీజియన్ల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం పనులు కూడా ప్రారంభమయ్యాయి.


వాట్సాప్ గవర్నెన్స్ - మన మిత్ర

పరిపాలనలో సాంకేతికతను జోడించి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 'మన మిత్ర' (వాట్సాప్ గవర్నెన్స్) విధానం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. జనవరి 2025లో ప్రారంభమైన ఈ సేవ ద్వారా, పౌరులు తమ స్మార్ట్‌ఫోన్ నుంచే 700 పైగా ప్రభుత్వ సేవలను పొందుతున్నారు. విద్యార్థుల హాల్ టికెట్లు, బిల్లుల చెల్లింపులు, సంక్షేమ పథకాల దరఖాస్తులు వాట్సాప్ ద్వారానే పూర్తవుతున్నాయి. 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో కేంద్ర ప్రభుత్వ అధికారులు ఏపీ మోడల్‌ను కొనియాడారు. ఏపీ మోడల్ ను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రకటించడం విశేషం.

'P4' కార్యక్రమం.. ఒక వినూత్న ప్రయోగం

ఈ ఏడాది ప్రభుత్వం చేపట్టిన అత్యంత వినూత్న కార్యక్రమాల్లో 'P4' (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్ట్‌నర్‌షిప్) ఒకటి. 'పేదరిక రహిత ఏపీ' లక్ష్యంగా ఉగాది రోజున దీన్ని ప్రారంభించారు. సమాజంలోని సంపన్నులు (మార్గదర్శులు) అత్యంత పేద కుటుంబాలను (బంగారు కుటుంబాలు) దత్తత తీసుకుని వారి అభివృద్ధికి తోడ్పడటం ఈ పథకం ఉద్దేశం. కేవలం డబ్బు ఇవ్వడమే కాకుండా, ఆ కుటుంబ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన వంటి వాటిపై దృష్టి సారించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో 250 కుటుంబాలను దత్తత తీసుకోగా, గ్రీన్‌కో, ఎంఈఐఎల్ వంటి కార్పొరేట్ సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యాయి.

గ్రీన్ ఎనర్జీ హబ్ గా ఆంధ్రప్రదేశ్

2024 చివర్లో ప్రారంభించిన 'ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ' ద్వారా రాష్ట్రాన్ని రెన్యూవబుల్ ఎనర్జీ హబ్‌గా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. టాటా పవర్ (రూ.49,000 కోట్లు), ఎన్టీపీసీ గ్రీన్ (రూ.2.08 లక్షల కోట్లు), రెన్యూ పవర్ (రూ.22,000 కోట్లు) వంటి సంస్థలు గ్రీన్ హైడ్రోజన్, సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాయి  విద్యుత్ చార్జీలను యూనిట్‌కు రూ.1.20 తగ్గించడం, 20 లక్షల ఎస్సీ/ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్ రూఫ్ టాప్స్ అందించడం వంటి చర్యలు సామాన్యులకు ఊరటనిచ్చాయి.

కేంద్ర సహకారంతో అభివృద్ధి పరుగులు

ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో "డబుల్ ఇంజన్ సర్కార్" ఫలాలను రాష్ట్రం అందుకుంది. విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ పనులు ప్రారంభమయ్యాయి. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 కోట్లతో ఊతమిచ్చింది. లక్ష కోట్ల విలువైన జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు రాష్ట్రానికి మంజూరయ్యాయి. సుమారు 90 కేంద్ర ప్రభుత్వ పథకాలను పునరుద్ధరించి నిధులు రాబట్టారు.

సవాళ్లు - విమర్శలు

అయితే, ప్రభుత్వంపై విపక్షాల నుంచి విమర్శలు లేకపోలేదు. ప్రభుత్వం కేవలం సదస్సులు, హైటెక్ ప్రాజెక్టులపైనే దృష్టి పెట్టిందని, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కొరత ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఉచిత గ్యాస్, బస్సు ప్రయాణం వంటి పథకాల వల్ల ఖజానాపై పడుతున్న భారం భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులకు దారితీయొచ్చనే ఆందోళనలను ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. వైద్య విద్యలో పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) విధానంపై కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ముగింపు: 2026 లక్ష్యాలు

2025లో సాధించిన విజయాలతో కూటమి ప్రభుత్వం 2026లోకి అడుగుపెడుతోంది. రాబోయే ఏడాదిలో రెవెన్యూ సమస్యలను సమగ్రంగా పరిష్కరించడం, వివాదరహిత భూములను యజమానులకు అందించడం, పారిశ్రామిక పెట్టుబడులను క్షేత్రస్థాయికి తీసుకురావడం, సంపద సృష్టి ద్వారా సంక్షేమ పథకాలను మరింత విస్తృతం చేయడం వంటి లక్ష్యాలపై దృష్టి సారించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 2025 ఉషోదయంలా ఉంటే, 2026 నవోదయంలా ఉండాలన్న ఆకాంక్షతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.
Chandrababu Naidu
Andhra Pradesh
AP government
Super Six schemes
AP development 2025
Nara Lokesh
AP industrial growth
Amaravati
Visakhapatnam
Pawan Kalyan

More Telugu News