వందేభారత్ స్లీపర్ 'వాటర్ టెస్ట్' సక్సెస్.. గంటకు 180 కి.మీ. వేగంతో ట్రయల్ రన్

  • వందేభారత్ స్లీపర్ రైలు వాటర్ టెస్ట్ వీడియో షేర్ చేసిన మంత్రి అశ్విని వైష్ణవ్
  • కోటా నుంచి నాగ్డా సెక్షన్ మధ్య గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పరుగు
  • టేబుల్ పై ఉంచిన నీటి గ్లాసులు కదలకపోవడంపై నెటిజన్ల ఆశ్చర్యం
  • రాత్రిపూట ప్రయాణాలను మరింత సౌకర్యవంతం చేయనున్న వందేభారత్ స్లీపర్
  • త్వరలోనే అందుబాటులోకి రానున్న అత్యాధునిక వందేభారత్ స్లీపర్ సేవలు
భారతీయ రైల్వే ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వందే భారత్ స్లీపర్ రైలు ప్రాజెక్టులో ఒక కీలక ముందడుగు పడింది. సుదూర ప్రయాణాల కోసం దేశీయంగా రూపొందించిన ఈ రైలుకు సంబంధించిన చివరి, అత్యంత ముఖ్యమైన హైస్పీడ్ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. రాజస్థాన్‌లోని కోటా-నాగ్డా సెక్షన్‌లో కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (CRS) పర్యవేక్షణలో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ ట్రయల్స్‌లో రైలు గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకొని తన సత్తాను చాటింది.

ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. "కోటా-నాగ్డా సెక్షన్‌లో కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ఆధ్వర్యంలో వందే భారత్ స్లీపర్ రైలును పరీక్షించాం. ఇది గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఈ కొత్త తరం రైలు సాంకేతిక సామర్థ్యాన్ని నిరూపించేందుకు మేము నిర్వహించిన 'వాటర్ టెస్ట్' కూడా విజయవంతమైంది" అని ఆయన పేర్కొన్నారు. రైలు అత్యధిక వేగంతో ప్రయాణిస్తున్నప్పటికీ, లోపల ఉంచిన నీటి గ్లాసులోని నీళ్లు కనీసం తొణకలేదని, ఇది రైలు స్థిరత్వానికి నిదర్శనమని మంత్రి వివరించారు.

రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు కూడా ఈ ట్రయల్స్‌పై స్పందించారు. "అధిక వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు రైలు పనితీరు పూర్తిగా సంతృప్తికరంగా ఉంది. ఈ ట్రయల్ విజయవంతమైనట్లు సీఆర్ఎస్ ప్రకటించారు" అని తెలిపారు. రైల్వే భద్రతా నిబంధనల ప్రకారం, ఏదైనా కొత్త రైలును వాణిజ్యపరంగా ప్రయాణికుల సేవలకు ప్రవేశపెట్టే ముందు సీఆర్ఎస్ నుంచి భద్రతా ధ్రువీకరణ పొందడం తప్పనిసరి. ఈ పరీక్షలో విజయం సాధించడంతో, వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కేందుకు ఉన్న ప్రధాన సాంకేతిక అడ్డంకి తొలగిపోయింది.

‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తితో బీఈఎంఎల్, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) సంయుక్తంగా ఈ ప్రోటోటైప్ రైలును తయారు చేశాయి. ఇందులో ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ టూ-టైర్, ఏసీ త్రీ-టైర్ కోచ్‌లతో కలిపి మొత్తం 16 బోగీలు ఉన్నాయి. సౌకర్యవంతమైన స్లీపర్ బెర్తులు, ఆటోమేటిక్ డోర్లు, సీసీటీవీ కెమెరాలు, ఫైర్ డిటెక్షన్ సిస్టమ్స్, దేశీయ కవచ్ భద్రతా వ్యవస్థ వంటి అత్యాధునిక సదుపాయాలను ఇందులో పొందుపరిచారు.

ఈ కీలక పరీక్ష విజయవంతం కావడంతో, త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైలు సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే, వాణిజ్య సేవలు ఎప్పుడు మొదలవుతాయి, తొలిదశలో ఏయే మార్గాల్లో ఈ రైళ్లను నడుపుతారు అనే విషయాలపై రైల్వే శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


More Telugu News