Ibomma Ravi: కేవలం మూడేళ్లలో కళ్లుచెరిరే రీతిలో ఐబొమ్మ రవి సంపాదన

Ibomma Ravi Earned Crores in 3 Years
  • మూడేళ్లలోనే రూ. 13 కోట్లు సంపాదించిన ఐబొమ్మ రవి
  • విలాసవంతమైన జీవితానికి రూ. 3 కోట్లు ఖర్చు చేసిన వైనం
  • 2007 నుంచే అక్రమ సంపాదనపై ఆసక్తి

ఐబొమ్మ రవి వ్యవహారం రోజురోజుకు మరింత సంచలనంగా మారుతోంది. పోలీసులు చేపట్టిన లోతైన దర్యాప్తులో అతడి అక్రమ కార్యకలాపాల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతోంది. కేవలం మూడేళ్ల వ్యవధిలోనే ఐబొమ్మ రవి సుమారు రూ.13 కోట్ల వరకు సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఆదాయంలో దాదాపు రూ.10 కోట్లను పూర్తిగా విలాసవంతమైన జీవనశైలికే ఖర్చు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఖరీదైన పబ్‌లు, ఫైవ్ స్టార్ హోటళ్లు, లగ్జరీ ప్రయాణాలు... ఇలా హైఫై లైఫ్ గడపడమే అతడి ప్రధాన లక్ష్యంగా మారిందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రవి బ్యాంక్ ఖాతాల్లో ఉన్న సుమారు రూ.3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు.


దర్యాప్తులో మరో షాకింగ్ విషయం ఏమిటంటే… ఐబొమ్మ రవికి పైరసీపై ఆసక్తి ఇప్పటిది కాదు. 2007 నుంచే అతడికి ఈ అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అప్పటి నుంచే తన స్నేహితుల సర్టిఫికెట్లు, ఐడెంటిటీ డాక్యుమెంట్లను వారి తెలియకుండానే దొంగిలిస్తూ అక్రమాలకు పాల్పడినట్టు సమాచారం. ప్రహ్లాద్, అంజయ్య, కాళీ ప్రసాద్ వంటి వ్యక్తుల ఆధార్, పాన్ వంటి కీలక పత్రాలను సేకరించి... వాటిపై తన ఫొటోను అతికించి ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేశాడు. ముఖ్యంగా ప్రహ్లాద్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ తెరిచినట్లు పోలీసులు నిర్ధారించారు.


ఈ నకిలీ పత్రాల ఆధారంగానే ఐబొమ్మ రవి మూడు కంపెనీలు కూడా స్థాపించినట్టు విచారణలో వెలుగులోకి వచ్చింది. ‘Supplier India’, ‘Hospital Inn’, ‘ER Infotech’ పేర్లతో ఈ సంస్థలను నమోదు చేసి... అక్రమ ఆదాయాన్ని చట్టబద్ధంగా చూపించే ప్రయత్నం చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన రామగుండంకు చెందిన అంజయ్య ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.


ఇక విచారణలో భాగంగా ఐబొమ్మ రవి చేసిన మరో అంగీకారం కూడా సంచలనంగా మారింది. టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫాంల ద్వారా ‘తండెల్’, ‘కిష్కిందపురి’ వంటి సినిమాలను డౌన్‌లోడ్ చేసి పైరసీ చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నట్టు సమాచారం. మొత్తం మీద ఐబొమ్మ రవి వ్యవహారం... కేవలం పైరసీ వరకే కాకుండా నకిలీ డాక్యుమెంట్లు, అక్రమ కంపెనీలు, కోట్లాది రూపాయల ఆర్థిక లావాదేవీల వరకు విస్తరించడంతో ఈ కేసు మరింత హైప్రొఫైల్‌గా మారుతోంది. ఇంకా దర్యాప్తు కొనసాగుతుండటంతో, రానున్న రోజుల్లో మరిన్ని షాకింగ్ నిజాలు బయటపడే అవకాశముందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

Ibomma Ravi
Ibomma
Ravi
Movie piracy
Fake documents
Financial fraud
Telangana police
Cyber crime
Tollywood
Crime news

More Telugu News