ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్‌పై తమన్ ఫైర్
- ట్రెండ్ అవుతున్న 'ది రాజాసాబ్' ట్రైలర్
- తన ట్వీట్ లో తమన్ పేరును ప్రస్తావించని తరణ్ ఆదర్శ్
- విమర్శలు గుప్పిస్తున్న తమన్ ఫ్యాన్స్
- 'మ్యూజిక్ బై తమన్' అంటూ ఘాటుగా స్పందించిన తమన్
బాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో పేరున్న అనలిస్ట్ తరణ్ ఆదర్శ్‌పై టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. ఈ వ్యవహారానికి కారణం రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘ది రాజాసాబ్’ ట్రైలర్ 2.0. తాజాగా ఈ ట్రైలర్ రిలీజ్ కావడంతో సోషల్ మీడియాలో హంగామా నెలకొంది. ఈ సందర్భంగా తరణ్ ఆదర్శ్ కూడా ట్రైలర్‌పై తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌లో షేర్ చేశాడు. అయితే ఆ ట్వీట్‌లో సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఎస్.ఎస్. తమన్ పేరును ప్రస్తావించకపోవడం వివాదానికి దారితీసింది.
ఈ విషయం గమనించిన తమన్ అభిమానులు వెంటనే స్పందించారు. “ఇంత పవర్‌ఫుల్ ట్రైలర్‌కు మ్యూజిక్ ప్రధాన కారణం. అయినా తమన్ పేరు ఎందుకు లేదు?” అంటూ తరణ్ ఆదర్శ్‌ను సోషల్ మీడియాలో ప్రశ్నించారు. ఈ చర్చ కాస్తా వైరల్ అవడంతో చివరికి స్వయంగా తమన్ రంగంలోకి దిగాడు. తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచే స్పందించిన ఆయన, “Music by Thaman S. This is my Twitter ID” అంటూ తన ఖాతాను ట్యాగ్ చేస్తూ ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ఈ ఒక్క లైన్ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇదిలా ఉండగా, కొంతమంది నెటిజన్లు మాత్రం తరణ్ ఆదర్శ్ ఉద్దేశపూర్వకంగానే తమన్ పేరు వదిలేశాడని అభిప్రాయపడుతున్నారు. బాలీవుడ్‌లో సౌత్ టెక్నీషియన్లకు సరైన క్రెడిట్ ఇవ్వకపోవడం ఇదే మొదటిసారి కాదని కూడా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ 2.0లో ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను మెప్పించింది.
మొత్తానికి, ‘ది రాజాసాబ్’ ట్రైలర్ 2.0 చుట్టూ సినిమా కంటే ముందే సోషల్ మీడియాలో మ్యూజిక్, క్రెడిట్‌లపై చర్చలు జరుగుతున్నాయి. ఈ వివాదం సినిమా మీద ఉన్న క్రేజ్‌ను మరింత పెంచుతోందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.