Toll Free Travel: ఆ రోజుల్లో హైదరాబాద్-విజయవాడ హైవేపై టోల్ ఎత్తివేయండి.. కేంద్ర మంత్రి గడ్కరీకి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ

Minister Komatireddy Venkatreddy Urges Nitin Gadkari For Toll Free Travel On Hyderabad Vijayawada Highway
  • సంక్రాంతి వేళ హైదరాబాద్ విజయవాడ హైవేపై టోల్ ఎత్తివేతకు విజ్ఞప్తి
  • జనవరి 9 నుంచి 18 మధ్య టోల్ ఫ్రీ ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని కోరిన మంత్రి
  • ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష
  • అవసరమైతే హైవేపై బైక్ పై వచ్చి పర్యవేక్షిస్తానన్న మంత్రి కోమటిరెడ్డి
సంక్రాంతి పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఊరట కలిగించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై టోల్ ఫీజుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. టోల్ వసూళ్ల కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బంది పడటంతో పాటు ఇంధనం, సమయం వృథా అవుతోందని మంత్రి లేఖలో వివరించారు.

ప్రజల సౌకర్యార్థం జనవరి 9 నుంచి 14 వరకు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో, అలాగే తిరుగు ప్రయాణంలో జనవరి 16 నుంచి 18 వరకు విజయవాడ-హైదరాబాద్‌ రూట్‌లో టోల్‌ ఫ్రీ ప్రయాణానికి అనుమతినివ్వాలని కోమటిరెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పండుగ రోజుల్లో సాధారణం కంటే 200 శాతం అధికంగా ట్రాఫిక్ ఉండే అవకాశం ఉందని, టోల్ గేట్ల వద్ద వాహనాలు గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ అంశంపై మంగళవారం సచివాలయంలో ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జనవరి 8 నుంచే వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున, పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్‌గేట్ల వద్ద వాహనాలు సాఫీగా వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వాహనదారుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని, వైద్య, పోలీస్, రెవెన్యూ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అధికారుల పనితీరును పరిశీలించేందుకు అవసరమైతే పండుగ సమయంలో తాను స్వయంగా మోటార్ సైకిల్‌పై వచ్చి హైవేపై పరిస్థితిని పర్యవేక్షిస్తానని మంత్రి స్పష్టం చేశారు.
Toll Free Travel
Komatireddy Venkatreddy
Nitin Gadkari
Hyderabad Vijayawada Highway

More Telugu News