సోఫా నుంచి లేస్తుండగా గన్ మిస్ ఫైర్ .. ఎన్ఆర్ఐ మృతి

  • పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ జిల్లాలో ఘటన
  • ఆత్మరక్షణ కోసం పెట్టుకున్న గన్ పొరపాటున పేలిన వైనం
  • హర్పీందర్‌ సింగ్‌ పొట్టలోకి దూసుకువెళ్లిన తూటా 
  • ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి  
గన్ మిస్ ఫైర్ కారణంగా ఓ ఎన్ఆర్ఐ మృతి చెందిన విషాదకర ఘటన పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. సోఫాలో నుంచి లేస్తుండగా, ఆత్మరక్షణ కోసం ఉంచుకున్న గన్ పొరపాటున పేలిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.
 
ధని సుచా సింగ్‌ గ్రామానికి చెందిన హర్పీందర్‌ సింగ్‌ అలియాస్‌ సోనూ కొన్నేళ్ల పాటు విదేశాల్లో ఉండి ఇటీవలే స్వగ్రామానికి తిరిగొచ్చాడు. ఇంట్లో బంధువుతో మాట్లాడుతుండగా సోఫా నుంచి లేచే సమయంలో నడుము వద్ద ఉన్న తుపాకీ అనుకోకుండా పేలింది. తూటా నేరుగా అతడి పొట్టలోకి దూసుకెళ్లింది.
 
తుపాకీ శబ్దంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమై అతడిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం భఠిండాకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో హర్పీందర్‌ మృతి చెందాడు.
 
మృతుడికి రెండున్నరేళ్ల కుమార్తె ఉంది. ఘటనపై పోలీసులు మృతుడి తండ్రి నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. స్వగ్రామంలో నిన్న అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. 


More Telugu News