బీసీసీఐ యూట‌ర్న్‌.. న్యూజిలాండ్ సిరీస్‌తో షమీకి మళ్లీ పిలుపు..?

  • వచ్చే న్యూజిలాండ్ సిరీస్‌కు షమీని ఎంపిక చేసే యోచనలో సెలెక్టర్లు
  • దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న పేసర్
  • ఫిట్‌నెస్‌ నిరూపించుకుంటే 2027 వరల్డ్ కప్ ప్రణాళికల్లోనూ చోటు
  • షమీ ఎంపికపై ఎన్డీటీవీ ఆసక్తికర కథనం 
టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. గత కొన్ని నెలలుగా జట్టుకు దూరంగా ఉంటున్న ఈ 35 ఏళ్ల పేసర్.. మళ్లీ సెలెక్టర్ల రాడార్‌లోకి వచ్చాడు. త్వరలో జరగనున్న న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు షమీని ఎంపిక చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. కేవలం రాబోయే సిరీస్‌ల కోసమే కాకుండా 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని షమీకి జట్టులో చోటు కల్పించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎన్డీటీవీ కథనం ప్రకారం.. బీసీసీఐకి చెందిన ఓ కీలక అధికారి షమీ ఎంపికపై స్పష్టతనిచ్చారు. "షమీ గురించి సెలెక్షన్ కమిటీ రెగ్యులర్‌గా చర్చిస్తోంది. అతడు రేసు నుంచి తప్పుకోలేదు. కేవలం ఫిట్‌నెస్ మాత్రమే ఆందోళన కలిగించే అంశం. షమీ స్థాయి బౌలర్ వికెట్లు తీయగలడని అందరికీ తెలుసు. దేశవాళీలో అతని ప్రదర్శన బాగుంది. అనుభవం, వికెట్లు తీసే సామర్థ్యం ఉన్న అతడిని న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపిక చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు" అని ఆ వర్గాలు తెలిపాయి.

షమీ చివరిసారిగా 2025 మార్చిలో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున ఆడాడు. ఆ టోర్నీలో 9 వికెట్లు తీసి సత్తా చాటాడు. అయితే, ఆ తర్వాత మోకాలి, చీలమండ గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. సర్జరీ, సుదీర్ఘ రీహ్యాబిలిటేషన్ తర్వాత ఇప్పుడు దేశవాళీ క్రికెట్‌లో షమీ అదరగొడుతున్నాడు. రంజీ ట్రోఫీలో కేవలం 4 మ్యాచ్‌ల్లోనే 20 వికెట్లు పడగొట్టడం అతని ఫామ్‌కు నిదర్శనం. అలాగే విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీల్లోనూ కలిపి 17 వికెట్లు తీశాడు.

గతంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా షమీ ఫిట్‌నెస్‌పై స్పందిస్తూ, అతడు పూర్తి ఫిట్‌గా ఉంటే జట్టులోకి తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశాడు. ఇప్పుడు దేశవాళీలో వరుసగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తుండటంతో షమీ ఫిట్‌నెస్ సమస్యలు తీరినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అనుభవజ్ఞుడైన షమీ రాకతో భారత బౌలింగ్ విభాగం మరింత బలోపేతం కానుంది.


More Telugu News