తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ ఏమిటో చెప్పిన అనిల్ రావిపూడి

  • తన కెరీర్‌ను మలుపుతిప్పింది ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ అన్న అనిల్ రావివూడి
  • గుంటూరు విజ్ఞాన్‌ కాలేజీలో నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌ 
  • 'మన శంకరవరప్రసాద్‌ గారు' మూవీ తనకు చాలా ప్రత్యేకమని వెల్లడి
తన కెరీర్‌ను మలుపుతిప్పిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ అని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రంలోని 'ఏంటి బాసు సంగతీ.. అదిరిపోద్దీ సంక్రాంతి' అనే పాటను తాజాగా విడుదల చేశారు.

గుంటూరు విజ్ఞాన్ కాలేజీలో నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తాను చదివిన కాలేజీలోనే ఈ పాటను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సందేశం ఇచ్చిన రావిపూడి.. 'మన శంకరవరప్రసాద్‌ గారు' చిత్రం తనకు చాలా ప్రత్యేకమని పేర్కొన్నారు. చిన్నతనం నుంచి చిరంజీవి, వెంకటేశ్‌, నాగార్జున, బాలకృష్ణల సినిమాలు చూసి పెరిగానని, ఏదో ఒకరోజు వీళ్ల సినిమాలకు దర్శకత్వం వహించాలనే కల ఉండేదన్నారు. వెంకటేశ్‌, బాలకృష్ణలతో ఇప్పటికే పని చేశానని, ఇప్పుడు చిరంజీవితో సినిమా చేయడం కల నెరవేరినట్టేనన్నారు.

అలాగే అడగ్గానే ఈ సినిమాలో అతిథి పాత్రకు వెంకటేశ్‌ అంగీకరించారని, చిరు, వెంకీలను ఒకే ఫ్రేమ్‌లో చూడాలన్న అందరి కల ఈ చిత్రంతో నెరవేరుతుందన్నారు. వీరిద్దరూ చేసిన అల్లరి, డ్యాన్స్‌ను ప్రేక్షకులు చాలాకాలం గుర్తుపెట్టుకుంటారని అన్నారు. 2025లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో పలకరించానని, ఆ సినిమాపై ప్రేక్షకులు చూపిన ప్రేమను తాను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. ఆ చిత్రం తన కెరీర్‌ను మలుపుతిప్పిందని అన్నారు. అదే విధంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'మన శంకరవరప్రసాద్‌ గారు' చిత్రాన్ని కూడా అందరూ ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 


More Telugu News