నేడు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా అంత్యక్రియలు... హాజరుకానున్న విదేశాంగ మంత్రి జైశంకర్

  • ఢాకాలోని జియా ఉద్యాన్‌లో నేడు ఖలీదా జియా అంత్యక్రియలు 
  • ఖలీదా జియా మృతికి సంతాపం తెలిపిన ప్రధాని మోదీ 
  • భారత్‌–బంగ్లాదేశ్‌ ద్వైపాక్షిక సంబంధాల పురోగతికి ఆమె చేసిన కృషిని ప్రశంసించిన మోదీ
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) అధినేత్రి ఖలీదా జియా అంత్యక్రియలు ఈ రోజు జరగనున్నాయి. ఢాకాలోని జియా ఉద్యానంలో, తన భర్త, మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ సమాధి పక్కనే ఆమెను ఖననం చేయనున్నారు. ఈ అంత్యక్రియలకు భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ హాజరుకానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఖలీదా జియా మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. 2015లో ఢాకా పర్యటన సందర్భంగా ఆమెతో భేటీ అయిన సందర్భాన్ని గుర్తు చేసుకున్న మోదీ, భారత్-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాల పురోగతికి ఆమె చేసిన కృషిని ప్రశంసించారు.

ఇదిలా ఉండగా, ఖలీదా జియా మరణంపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కూడా సంతాపం ప్రకటించారు. బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఖలీదా జియా కీలక పాత్ర పోషించారని ఆమె పేర్కొన్నారు. 


More Telugu News