Shiva Dhar Reddy: తెలంగాణలో 14 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

Telangana to Recruit 14000 Constables Soon Says DGP
  • కొత్త ఏడాదిలో ప్రకటన వెలువడే అవకాశం
  • రెండేళ్లుగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులు
  • సిబ్బందిపై పనిభారం తగ్గించేందుకు ప్రభుత్వ నిర్ణయం
తెలంగాణలోని నిరుద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది. పోలీస్ శాఖలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సుమారు 14 వేల స్టయిపెండరీ క్యాడెట్ కానిస్టేబుల్ పోస్టులతో పాటు ఇతర యూనిఫామ్ సర్వీసుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. ఈ భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉన్నాయని, నూతన సంవత్సర కానుకగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకు మూడు విడతలుగా (2016, 2018, 2022) పోలీసు నియామకాలు జరిగాయి. అయితే 2023 నుంచి రిక్రూట్‌మెంట్‌లో జాప్యం జరుగుతుండటంతో ప్రభుత్వంపై నిరుద్యోగులు ఒత్తిడి తెస్తున్నారు. లక్షలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోతుందన్న ఆందోళనలో ఉన్న తరుణంలో డీజీపీ ప్రకటన వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

శాఖలో ఏటా పదవీ విరమణలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటం, కొత్తగా సిబ్బంది తోడవకపోవడంతో ప్రస్తుతం ఉన్న పోలీసులపై పనిభారం రెట్టింపైంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు ఇస్తేనే సిబ్బంది సంఖ్య సమతుల్యంగా ఉంటుందని పోలీసు సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సిబ్బంది కొరతను అధిగమించి, క్షేత్రస్థాయిలో పనితీరును మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Shiva Dhar Reddy
Telangana police jobs
Telangana constable recruitment
Telangana police notification
Police jobs 2024
Telangana government jobs
Constable jobs
Telangana recruitment
DGP Shiva Dhar Reddy
Telangana police vacancy

More Telugu News