HYDRAA: దుర్గం చెరువు కబ్జా ఎలా జరిగిందో శాటిలైట్ చిత్రాలు విడుదల చేసిన హైడ్రా

HYDRAA Reveals Durgam Cheruvu Encroachment with Satellite Images
  • దుర్గం చెరువు ఆక్రమణలకు అద్దం పడుతున్న హైడ్రా విడుదల చేసిన శాటిలైట్ చిత్రాలు
  • ఇనార్బిట్ మాల్ వైపు కబ్జా కోరల్లో చిక్కుకున్న 5 ఎకరాల స్థలం స్వాధీనం
  • మట్టితో పూడ్చి పార్కింగ్ పేరుతో నెలకు రూ.50 లక్షల దందా చేసిన వైనం
  • 160 ఎకరాల విస్తీర్ణంలోని చెరువు నేడు 116 ఎకరాలకు కుంచించుకుపోయిన పరిస్థితి
చారిత్రక దుర్గం చెరువును కబ్జాదారులు ఎలా కబళించారో కళ్లకు కట్టే సాక్ష్యాలను హైడ్రా (HYDRAA) బయటపెట్టింది. ఒకప్పుడు 160 ఎకరాల విస్తీర్ణంతో అలరారిన ఈ చెరువు, నేడు 116 ఎకరాలకు ఎలా కుంచించుకుపోయిందో వివరిస్తూ 'నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్' (NRSC) సహకారంతో శాటిలైట్ చిత్రాలను విడుదల చేసింది. దశాబ్దాలుగా సాగిన ఈ ఆక్రమణల పర్వాన్ని ఈ చిత్రాలు స్పష్టంగా బట్టబయలు చేస్తున్నాయి.

గోల్కొండ కోట నివాసులకు దాహార్తిని తీర్చిన ఈ 'సీక్రెట్ లేక్'.. నేడు కబ్జాల చెరలో చిక్కుకుంది. హైడ్రా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 1976 నాటికే దుర్గం చెరువులో 29 ఎకరాలు కబ్జాకు గురై 131.66 ఎకరాలకు తగ్గింది. ఆ తర్వాత 1995 వరకు సురక్షితంగా ఉన్నప్పటికీ, 1995 నుంచి 2000 మధ్య మరో 10 ఎకరాలు అన్యాక్రాంతమై 121 ఎకరాలకు పడిపోయింది. 2000 సంవత్సరం నుంచి నేటి వరకు మరో 5 ఎకరాలు కబ్జా కోరల్లోకి వెళ్లినట్లు శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి.

తాజాగా మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ వైపు దాదాపు 5 ఎకరాల మేర జరిగిన ఆక్రమణలను హైడ్రా మంగళవారం విజయవంతంగా తొలగించింది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి కబ్జాలను నిర్ధారించుకున్నారు. అక్కడ 10 నుంచి 15 మీటర్ల మేర మట్టిని చెరువులో డంప్ చేసి, ఆ స్థలాన్ని చదును చేసి భారీ పార్కింగ్ దందాను నడిపిస్తున్నారు. స్కూల్ బస్సులు, ఐటీ ఉద్యోగుల క్యాబ్‌ల పార్కింగ్ కోసం ఈ స్థలాన్ని వాడుతూ, నెలకు దాదాపు రూ.50 లక్షల వరకు అద్దెలు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ఓ ప్రజాప్రతినిధి అండదండలతోనే ఈ వ్యవహారం నడుస్తోందని, ఆక్రమిత స్థలం తనదేనంటూ సదరు ప్రజాప్రతినిధి క్లైమ్ చేస్తున్నట్లు సమాచారం. ఎలాంటి భూ రికార్డులు లేకుండానే ఏళ్ల తరబడి ఈ దందా సాగుతోంది. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి కూడా ఈ ఆక్రమణలు అడ్డుగా మారాయి. 

మంగళవారం జరిగిన ఆపరేషన్‌లో హైడ్రా అధికారులు పార్కింగ్‌లోని వాహనాలను ఖాళీ చేయించి, ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేశారు. త్వరలోనే డంప్ చేసిన మట్టిని కూడా తొలగించి చెరువు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ రికార్డుల ఆధారంగా చెరువు పూర్తి విస్తీర్ణాన్ని పక్కాగా తేల్చే పనిలో హైడ్రా నిమగ్నమైంది.
HYDRAA
Durgam Cheruvu
Hyderabad
Lake Encroachment
Satellite Images
NRSC
Inorbit Mall
AV Ranganath
Telangana
Lake Restoration

More Telugu News