మందులకు కూడా లొంగని డెడ్లీ ఫంగస్... గతంలో కంటే ప్రాణాంతకం!

  • ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న 'కాండిడా ఆరిస్' ఫంగస్
  • చికిత్స అందించినా 50 శాతానికి పైగా మరణాలు
  • చర్మంపై ఎక్కువ కాలం ఉంటూ ఇతరులకు వ్యాప్తి
  • సాధారణ ల్యాబ్ పరీక్షల్లో గుర్తించడం కష్టం
భారతీయ పరిశోధకుల నేతృత్వంలో జరిగిన ఓ తాజా అధ్యయనం ఆరోగ్య రంగంలో ఆందోళనకర విషయాలను వెల్లడించింది. డ్రగ్ రెసిస్టెంట్ (మందులకు లొంగని) ఫంగల్ జాతి 'కాండిడా ఆరిస్' ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోందని, ఇది గతంలో కంటే ప్రాణాంతకంగా మారుతోందని హెచ్చరించింది. ఢిల్లీలోని వల్లభ్‌భాయ్ పటేల్ చెస్ట్ ఇన్‌స్టిట్యూట్, అమెరికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్) సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి.

ఈ ప్రమాదకరమైన ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 65 లక్షల మందిపై ప్రభావం చూపుతున్నాయని పరిశోధకులు తెలిపారు. దీని తీవ్రత ఎంతలా ఉందంటే.. యాంటీ ఫంగల్ చికిత్స అందించినప్పటికీ మరణాల రేటు 50 శాతానికి పైగా ఉంటోందని పేర్కొన్నారు. ఇది బహుళ ఔషధాలను తట్టుకునే శక్తిని కలిగి ఉండటం వైద్యులను కలవరపెడుతోంది. కాండిడా ఆరిస్ మానవ చర్మంపై ఎక్కువ కాలం జీవించి ఉండగలదని, అక్కడి నుంచి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుందని నిపుణులు వివరించారు.

ఇది ఈస్ట్ నుంచి ఫిలమెంట్‌గా రూపం మార్చుకోవడం, కణాల సమూహాలను ఏర్పరచుకోవడం వంటి కణ స్థాయి వ్యూహాలతో మనుగడ సాగిస్తోందని 'మైక్రోబయాలజీ అండ్ మాలిక్యులర్ బయాలజీ రివ్యూస్' జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక పేర్కొంది. చర్మంపై, అలాగే నిర్జీవ ప్రదేశాలపై కూడా ఇది గమ్ లాగా అతుక్కుపోతుందని తెలిపారు. దీనివల్ల ఆసుపత్రుల్లో చేరిన రోగుల నుంచి ఇతరులకు ఈ ఫంగస్ సులభంగా వ్యాపించే ముప్పు ఉందని హెచ్చరించారు.

మరోవైపు, సాధారణ ల్యాబ్ పరీక్షల్లో ఈ ఫంగస్‌ను గుర్తించడం కష్టమని, తరచుగా దీనిని వేరే ఈస్ట్‌గా పొరబడే అవకాశం ఉందని, దీనివల్ల చికిత్స ఆలస్యమవుతోందని పరిశోధకులు వివరించారు. ఈ విపత్తును ఎదుర్కోవడానికి కొత్త రకం యాంటీ ఫంగల్ మందులు, మెరుగైన వ్యాక్సిన్లు, అధునాతన డయాగ్నస్టిక్ పరీక్షలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు సూచించారు.


More Telugu News