అద్దంకి, కందుకూరు ప్రజల ఆకాంక్ష నెరవేరింది: మంత్రి గొట్టిపాటి రవికుమార్

  • అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో కలపడంపై హర్షం
  • ప్రజల ఆకాంక్షల మేరకు అద్దంకికి రెవెన్యూ డివిజన్ మంజూరు చేసినట్టు వెల్లడి
  • దుర్గగుడిలో విద్యుత్ అంతరాయంపైనా మంత్రి వివరణ 
  • జనవరి 6 లేదా 7 తేదీల్లో దేవాదాయ శాఖతో ప్రత్యేక సమన్వయ సమావేశం
అద్దంకి, కందుకూరు నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను మన్నిస్తూ, ఆ ప్రాంతాలను తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతూ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ఎంతో సంతోషదాయకమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నేడు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన అశాస్త్రీయ జిల్లాల విభజనను సరిదిద్దుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.

యువగళం పాదయాత్ర సమయంలో నారా లోకేశ్ ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ, కందుకూరు, అద్దంకి ప్రాంతాలను ప్రకాశం జిల్లాలో తిరిగి విలీనం చేయడం శుభపరిణామమన్నారు. ముఖ్యంగా 2012 నుంచి అద్దంకి ప్రాంత ప్రజలు తమ రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం, పాలనా సౌలభ్యం కోసం రెవెన్యూ డివిజన్ కావాలని కోరుతున్నారని, వారి విజ్ఞప్తిని మన్నించి అద్దంకిని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నాళ్లు బాపట్ల జిల్లా పరిధిలో ఉండటం వల్ల అద్దంకి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తాజా నిర్ణయంతో ఆ కష్టాలు తీరనున్నాయని వివరించారు.

దుర్గగుడిలో అంతరాయంపై వివరణ
ఇటీవల విజయవాడ కనకదుర్గ ఆలయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై మంత్రి స్పష్టత ఇచ్చారు. ఇది కేవలం అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా జరిగిన ఘటన అని, విద్యుత్ సరఫరాలో సాంకేతిక లోపాలు లేవని స్పష్టం చేశారు. కరెంట్ కేవలం 10 నిమిషాలు మాత్రమే నిలిచిపోయిందని, విషయం తెలిసిన వెంటనే అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. 

ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు జనవరి 6 లేదా 7 తేదీల్లో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఈవో, ఇతర ముఖ్య అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ చిన్న పొరపాటును ఆసరాగా చేసుకుని రాజకీయ విమర్శలు చేయడం తగదని వైసీపీ నేతలకు హితవు పలికారు. ప్రజల మనోభావాలతో ముడిపడిన అంశాలపై అనవసర రాద్ధాంతం చేయడం, ప్రతి సాధారణ విషయాన్ని రాజకీయాలకు వాడుకోవడం వైసీపీ నాయకులకు అలవాటుగా మారిపోయిందని మంత్రి మండిపడ్డారు. ఏ ధర్మాన్నైనా, సంప్రదాయాలనైనా చిత్తశుద్ధితో కాపాడేది ఒక్క కూటమి ప్రభుత్వమేనని గొట్టిపాటి రవికుమార్ ఉద్ఘాటించారు. 


More Telugu News