Sudarshan Chakra: ఢిల్లీ గగనతలంపై సుదర్శన చక్రం.. శత్రువుల డ్రోన్లు, మిసైళ్లను నిర్వీర్యం చేయడమే లక్ష్యం
- ఢిల్లీ గగనతల భద్రతపై కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు
- రూ. 5,181 కోట్ల అంచనాతో సుదర్శన చక్రం
- గగనతల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ప్రత్యేక దృష్టి
దేశ రాజధాని ఢిల్లీ గగనతల భద్రతను మరింత బలోపేతం చేయడంపై కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఢిల్లీలోని అత్యంత సున్నితమైన వీఐపీ-89 జోన్ పరిధిలో గగనతల రక్షణను కట్టుదిట్టం చేసేందుకు దేశీయంగా అభివృద్ధి చేసిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్స్ కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది.
ఈ గగనతల రక్షణ వ్యవస్థను ‘సుదర్శన చక్ర – ఫర్ ఢిల్లీ’ అనే ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా దేశ రాజధాని చుట్టూ సుమారు 30 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి గగనతల ముప్పు ఎదురైనా వెంటనే గుర్తించి, అడ్డుకునే సామర్థ్యం ఈ వ్యవస్థకు ఉంటుంది. డ్రోన్లు, మిసైళ్లు, శత్రు యుద్ధవిమానాల నుంచి వచ్చే ప్రమాదాలను ముందే గుర్తించి నిర్వీర్యం చేయడమే దీని ప్రధాన లక్ష్యం.
ఈ అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను డీఆర్‌డీవో స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసింది. దీని అంచనా వ్యయం సుమారు రూ.5,181 కోట్లుగా పేర్కొంటున్నారు. ఇటీవల కాలంలో డ్రోన్ల ద్వారా దాడులు, గగనతల ముప్పులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ రాజధాని భద్రతపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, భారత సైనిక సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా రక్షణ మంత్రిత్వశాఖ తాజాగా రూ.79 వేల కోట్ల విలువైన ఆయుధ సామగ్రి కొనుగోళ్లకు ఆమోదం తెలిపింది. ఈ పెద్ద ప్యాకేజీలో భాగంగానే ఢిల్లీకి సంబంధించిన ఈ గగనతల రక్షణ వ్యవస్థకు కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం.
గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ‘సుదర్శన చక్ర’ వ్యవస్థ గురించి ప్రస్తావించారు. దేశంలోని వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాలు, పౌర కేంద్రాలు, జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలను గగనతల దాడుల నుంచి రక్షించేలా బహుళ అంచెల రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని అప్పుడే ప్రకటించారు.
ఈ వ్యవస్థలో భాగంగా శత్రు క్షిపణులు, యుద్ధవిమానాలను గుర్తించే అధునాతన రాడార్ వ్యవస్థలు, వాటిని మధ్యలోనే కూల్చివేసే ఇంటర్‌సెప్టర్లు, అలాగే సైబర్ యుద్ధాన్ని ఎదుర్కొనే సామర్థ్యం కూడా ఉండనుంది. డీఆర్‌డీవో, ప్రైవేట్ రక్షణ సంస్థలు, భారత సైన్యం కలిసి ఈ భారీ ప్రాజెక్ట్‌ను అమలు చేయడానికి ఇప్పటికే ప్రాథమిక సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం. మొత్తంగా చూస్తే, ఢిల్లీ గగనతల భద్రతను ఇనుమడింపజేసే దిశగా సుదర్శన చక్ర ప్రాజెక్ట్ దేశ రక్షణ రంగంలో మరో కీలక మైలురాయిగా నిలవనుందని రక్షణ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.