Narendra Modi: పుతిన్ నివాసంపై డ్రోన్ దాడి... తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

Narendra Modi Concerned Over Drone Attack on Putin Residence
  • పుతిన్ నివాసంపై దాడి వార్తలు కలచివేసాయన్న మోదీ
  • శాంతి చర్చలకు విఘాతం కలిగించే చర్యలు వద్దని హితవు 
  • 91 డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి చేసిందన్న రష్యా
  • ట్రంప్ మధ్యవర్తిత్వంతో కొలిక్కి వస్తున్న శాంతి చర్చలు
  • యుద్ధం ముగింపు దశకు చేరుకుందన్న అమెరికా అధ్యక్షుడు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసం లక్ష్యంగా జరిగిన డ్రోన్ దాడుల పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ.. ప్రస్తుతం జరుగుతున్న దౌత్యపరమైన చర్చలే యుద్ధాన్ని ముగించి, శాంతిని స్థాపించడానికి సరైన మార్గమని స్పష్టం చేశారు. పుతిన్ నివాసంపై దాడి జరిగిందన్న వార్తలు తనను కలచివేశాయని, ఇలాంటి సమయంలో శాంతి చర్చల ప్రక్రియకు విఘాతం కలిగించేలా ఏ పక్షం కూడా వ్యవహరించకూడదని మోదీ సూచించారు. అందరూ చర్చలపైనే దృష్టి సారించాలని ఆయన కోరారు.

రాత్రి వేళ, పుతిన్ ఉంటున్న నొవొగొరోడ్ ప్రాంతంపై ఉక్రెయిన్ 91 లాంగ్ రేంజ్ డ్రోన్లతో విరుచుకుపడిందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆరోపించారు. దీనిని ఉగ్రవాద చర్యగా ఆయన అభివర్ణించారు. అయితే రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలు వాటన్నింటినీ కూల్చివేశాయని, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని 'టాస్' వార్తా సంస్థ వెల్లడించింది. ఉక్రెయిన్ దాడికి రష్యా తగిన సమాధానం చెబుతుందని లావ్రోవ్ హెచ్చరించారు.

మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన ఆదివారం పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడగా, ఫ్లోరిడాలోని తన నివాసంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. ఈ చర్చలు చాలా సానుకూలంగా సాగాయని, యుద్ధం ముగింపు దశకు చాలా దగ్గరగా ఉందని ట్రంప్ వెల్లడించారు. ఇలాంటి కీలక సమయంలో దాడులు జరగడం అంతర్జాతీయంగా ఆందోళన రేకెత్తిస్తోంది.
Narendra Modi
Vladimir Putin
Drone attack
Russia Ukraine war
Sergei Lavrov
Donald Trump
Volodymyr Zelenskyy
Peace talks
Russia
Ukraine

More Telugu News