Bhavani Warden: విద్యార్థినిని చితకబాదిన వార్డెన్.. ఎస్సీ గురుకులంలో ఘటన.. వీడియో ఇదిగో!

SC Gurukulam Warden Assaults Student Students Demand Suspension
  • భూపాలపల్లిలోని హాస్టల్ లో అమానుషం
  • రహస్యంగా వీడియో తీసిన తోటి విద్యార్థినులు
  • వార్డెన్ పై మండిపడుతున్న విద్యార్థి సంఘాలు
తెలంగాణలోని భూపాలపల్లి ఎస్సీ బాలికల గురుకుల వసతి గృహంలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. హాస్టల్ వార్డెన్ ఓ విద్యార్థినిని చితకబాదుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొట్టొద్దని, క్షమించాలని విద్యార్థిని వేడుకుంటున్నా వార్డెన్ వినిపించుకోకపోవడం విమర్శలకు దారితీసింది. ఈ ఘటనను ఓ విద్యార్థిని రహస్యంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. విద్యార్థినిని విచక్షణారహితంగా కొట్టిన సదరు వార్డెన్ ను కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

భూపాలపల్లిలోని ఎస్సీ బాలికల గురుకులంలో చదువుకుంటున్న ఓ విద్యార్థిని ఇటీవల పరీక్ష రాశాక చెప్పకుండా ఎటో వెళ్లిపోయింది. విద్యార్థిని కనిపించడంలేదని వార్డెన్ తో పాటు తోటి విద్యార్థినులు ఆందోళన చెందారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఆ తర్వాత బాలిక తిరిగి హాస్టల్ కు తిరిగిరావడంతో.. వార్డెన్ భవానీ ఆమెను తన గదికి పిలిపించుకుంది. పరీక్ష రాశాక ఎక్కడికి వెళ్లావంటూ కర్రతో కొట్టింది. ‘నువ్వు కనిపించకుండా పోయిన తర్వాత నేను ఎంత ఆందోళన చెందానో తెలుసా.. నా ఉద్యోగం రిస్క్ లో పడేలా చేస్తావా’ అంటూ వార్డెన్ భవానీ ఆ విద్యార్థినిని కొట్టడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

వార్డెన్ పై విద్యార్థినుల ఆరోపణలు..
వార్డెన్ భవానీ ప్రతిరోజూ ఏదో ఒక సాకుతో తమను కొడుతుందని హాస్టల్ విద్యార్థినులు ఆరోపించారు. తమ తోటి విద్యార్థినిని విచక్షణారహితంగా కొట్టిన వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వార్డెన్ ను సస్పెండ్ చేయాలంటూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.
Bhavani Warden
SC Gurukulam
Telangana
Bhupalpally
Hostel Warden
Student Assault
Gurukula School
Student Protest
Viral Video
Education

More Telugu News