Rashmika-Vijay Deverakonda: రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి డేట్‌ ఫిక్స్..?

Rashmika Mandanna And Vijay Deverakonda To Marry On February 26 In Udaipur
  • 2026 ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి
  • కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రైవేట్‌గా వివాహ వేడుక
  • సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో స్పెషల్ రిసెప్షన్
  • పెళ్లి వార్తలను ఇంకా అధికారికంగా ధ్రువీకరించని జంట
టాలీవుడ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ జంట పెళ్లికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. 2026 ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ఓ ప్యాలెస్‌లో వీరి వివాహం జరగనుందని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ జంటకు 2025 అక్టోబర్ 3నే హైదరాబాద్‌లో నిశ్చితార్థం జరిగింది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ వేడుకను నిర్వహించారు. ఉదయ్‌పూర్‌లో జరగబోయే పెళ్లి కూడా పూర్తిగా ప్రైవేట్ వ్యవహారంగా ఉండనుందని, ఆ తర్వాత హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారని సమాచారం. అయితే, విజయ్ కానీ, రష్మిక కానీ ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ఇటీవల 'ది హాలీవుడ్ రిపోర్టర్'తో మాట్లాడిన రష్మిక.. తన పెళ్లి వార్తలపై స్పందిస్తూ, "నేను ఈ వార్తలను ఖండించను, అలాగని నిజమని చెప్పను. దీని గురించి మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు కచ్చితంగా మాట్లాడతాం" అని పరోక్షంగా సమాధానమిచ్చారు. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట మధ్య మంచి అనుబంధం ఉంది. గత ఆగస్టులో న్యూయార్క్‌లో జరిగిన ఇండియా డే పరేడ్‌లో వీరిద్దరూ గ్రాండ్ మార్షల్స్‌గా పాల్గొన్నప్పుడు కూడా వీరి కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంది.

ఇక, సినిమాల విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ చివరగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన 'కింగ్‌డమ్'లో కనిపించగా, త్వరలో 'రౌడీ జనార్దన'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రష్మిక మందన్న ఇటీవల ఆయుష్మాన్ ఖురానాతో 'తమ్మ', తెలుగులో 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె చేతిలో 'కాక్‌టెయిల్ 2', 'మైసా' వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్, రష్మిక మరోసారి జతకట్టే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
Rashmika-Vijay Deverakonda
Rashmika Mandanna
Vijay Deverakonda
Vijay Rashmika wedding
Telugu cinema
Tollywood wedding
Geetha Govindam
Dear Comrade
Udaipur palace wedding
Indian celebrity wedding
Rowdy Janardhan

More Telugu News