Gadwal: గద్వాలలో దారుణం.. మైనర్ కూతురిని గర్భవతిని చేసిన తండ్రి

Father Arrested for Impregnating Minor Daughter in Gadwal
  • గద్వాల జిల్లా కేంద్రంలో సభ్యసమాజం తలదించుకునే ఘటన
  • పదహారేళ్ల కూతురిపై పలుమార్లు లైంగిక దాడి చేసిన తండ్రి
  • విషయం బయటకు రాకుండా బాలికకు అబార్షన్ చేయించిన వైనం
  • బాధితురాలి తల్లి ఫిర్యాదుతో నిందితులిద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు
తెలంగాణలోని గద్వాల జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగుచూసింది. రక్షించాల్సిన తండ్రే భక్షకుడిగా మారి కన్న కూతురిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. మైనర్ అని కూడా చూడకుండా లైంగిక దాడి చేసి ఆమెను గర్భవతిని చేశాడు. ఈ పాపానికి నిందితుడి మొదటి భార్య సహకరించడమే కాకుండా, బాలికకు అబార్షన్ చేయించి విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు నిందితులిద్దరినీ అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన‌ వివరాల ప్రకారం.. గద్వాల జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి కొన్నేళ్ల కిందట వివాహమైంది. పిల్లలు పుట్టకపోవడంతో భార్య చెల్లిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు నలుగురు పిల్లలు పుట్టగా, అనంతరం మొదటి భార్యకు కూడా ఇద్దరు పిల్లలు కలిగారు. అందరూ కలిసి ఒకేచోట ఉంటున్నారు. అయితే, ఆ వ్యక్తి వక్రబుద్ధితో తన రెండో భార్య కూతురు (16)పై కన్నేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం నిందితుడి మొదటి భార్యకు తెలిసింది. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించిన ఆమె.. భర్తను మందలించాల్సింది పోయి అతనికి సహకరించింది. గుట్టుచప్పుడు కాకుండా బాలికకు అబార్షన్ చేయించింది.

అయితే, బాధితురాలు ఇటీవల తన నరకయాతనను స్థానికంగా ఉండే ఓ మహిళకు చెప్పుకుని కన్నీరుమున్నీరైంది. దీంతో ఆ మహిళ వెంటనే బాలిక తల్లికి సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి.. అఘాయిత్యానికి పాల్పడిన తండ్రితో పాటు అతనికి సహకరించిన మొదటి భార్యను అదుపులోకి తీసుకున్నారు. తండ్రి చేసిన పనికి స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Gadwal
Minor Girl
Father Arrested
Telangana Crime
Sexual Assault
Abortion Case
Crime News
Police Investigation
Gadwal
Child Abuse

More Telugu News