Bandhavgarh Tiger Reserve: యువకుడిపై దాడి చేసి.. ఇంట్లోకి వెళ్లి మంచంపై కూర్చున్న పులి.. 8 గంటల హైడ్రామా!

Tiger Enters House After Attacking Youth in Bandhavgarh
  • బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్ సమీపంలోని గ్రామంలోకి చొరబడ్డ పులి
  • గోపాల్ కోల్ అనే యువకుడిని తీవ్రంగా గాయపరిచిన వ్యాఘ్రం
  • దాడి తర్వాత ఒక ఇంట్లోకి దూరి.. మంచంపై తిష్టవేసిన పులి
మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్ పరిధిలోని ఒక గ్రామంలో సోమవారం ఒక పులి ప్రజలను బెంబేలెత్తించింది. యువకుడిపై దాడి చేయడమే కాకుండా, గ్రామస్తులను భయబ్రాంతులకు గురిచేస్తూ ఏకంగా ఓ ఇంట్లోకి వెళ్లి మంచంపై దర్జాగా కూర్చుంది. దీంతో గ్రామస్థులు ప్రాణభయంతో తమ ఇళ్ల పైకప్పుల పైకి ఎక్కి గంటల తరబడి బిక్కుబిక్కుమంటూ గడిపారు.

సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో పాన్‌పథా బఫర్ జోన్ నుంచి వచ్చిన పులి మొదట పంట పొలాల్లో కనిపించింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకునే లోపే మధ్యాహ్నం సమయానికి అది గ్రామంలోకి చొరబడింది. గ్రామస్థులు కర్రలతో పులిని అడవిలోకి తోలే ప్రయత్నం చేయగా, అది ఒక్కసారిగా గోపాల్ కోల్ అనే యువకుడిపైకి లంఘించింది. ఈ దాడిలో అతడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో అతడిని మొదట బర్హీ ఆసుపత్రికి, అక్కడి నుంచి కట్నీకి తరలించారు.

యువకుడిపై దాడి చేసిన అనంతరం ఆ పులి దుర్గా ప్రసాద్ ద్వివేది అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించింది. అక్కడ ఉన్న ఒక మంచంపై కూర్చుండిపోవడంతో గ్రామస్థులు వణికిపోయారు. సమాచారం అందుకున్న పాన్‌పథా బఫర్ జోన్ రెస్క్యూ టీమ్, వెటర్నరీ డాక్టర్లతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుంది. సుమారు 8 గంటల పాటు శ్రమించి పులికి మత్తుమందు ఇచ్చి బంధించి, సురక్షితంగా అడవిలోకి తరలించారు. 
Bandhavgarh Tiger Reserve
Madhya Pradesh
tiger attack
Indian tiger
wildlife
Gopal Kol
Panpatha Buffer Zone
tiger rescue

More Telugu News