అన్ని ఆలయాల్లో 'శ్రీవారి సేవకులు' తరహా విధానం: సీఎం చంద్రబాబు ఆదేశాలు

  • పాలనపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • వివిధ శాఖలకు కీలక సూచనలు, ఆదేశాలు
  • ప్రజలకు రెవెన్యూ సేవలు సులభంగా అందాలి, సర్వేల్లో తప్పులు జరగొద్దని స్పష్టీకరణ 
  • ధాన్యం కొనుగోళ్లలో ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
  • అగ్నిమాపక శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు
రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో తిరుమల శ్రీవారి సేవకుల తరహాలో స్వచ్ఛంద సేవలను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత సులభంగా అందించాలని, భూ సర్వేల్లో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం ఇవ్వరాదని స్పష్టం చేశారు. సోమవారం నాడు అమరావతిలోని ఆర్టీజీఎస్ నుంచి రెవెన్యూ, వ్యవసాయం, వైద్యారోగ్యం, దేవదాయ సహా పలు కీలక శాఖల పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సేవలు ప్రజలకు ఎలా అందుతున్నాయనే దానిపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, "రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో స్థానిక భక్తులతో వాలంటీర్లను నియమించుకోవాలి. భగవంతుడి సేవ చేసేందుకు చాలామంది ముందుకొస్తారు. అలాంటి వారిని ప్రోత్సహించి, వారి సేవలను వినియోగించుకోవాలి. ఇప్పటికే శ్రీశైలంలో ఈ విధానం కొనసాగుతోంది. ఇదే స్ఫూర్తితో అన్ని ఆలయాల్లో అమలు చేయాలి" అని దేవదాయ శాఖ అధికారులకు సూచించారు.

ప్రజలకు నిత్యం అవసరమయ్యే రెవెన్యూ, వైద్యారోగ్య శాఖల పనితీరుపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. "ప్రజలకు రెవెన్యూ సేవలు సులభంగా, వేగంగా అందాలి. భూ సర్వేలు చేపట్టేటప్పుడు ప్రజలు ఇబ్బందులు పడకూడదు. ఈ విషయంలో రెవెన్యూ యంత్రాంగంపై ఉన్న చెడ్డపేరును తొలగించుకునేలా పనిచేయాలి" అని ఆయన దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా పీహెచ్‌సీల నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు అన్నిచోట్లా పరిశుభ్రత పాటిస్తూ, మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. వైద్యులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.

మెరుగైన ప్రజారోగ్యం కోసం వ్యవసాయ, వైద్యారోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. "భూసార పరీక్షలు నిర్వహించి, ఎరువుల వాడకాన్ని తగ్గించేలా రైతులకు అవగాహన కల్పించాలి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ పంటలు పండించాలో తెలియజేయాలి. దీనికోసం క్షేత్రస్థాయిలో రైతు సేవా కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కలిసి పనిచేయాలి" అని సూచించారు. 

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని, మిల్లర్లు ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని రవాణా శాఖను ఆదేశించారు. అగ్నిమాపక శాఖ పనితీరు బాగుందని అభినందించారు. ఈ సమీక్షలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


More Telugu News