హైదరాబాదులో డిజిటల్ అరెస్ట్ మోసం... గుజరాత్ లో ఇద్దరి అరెస్ట్

  • డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసపోయిన హైదరాబాద్ మహిళ
  • రూ. 1.95 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
  • గుజరాత్‌కు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
  • మ్యూల్ ఖాతాల ద్వారా హవాలా మార్గంలో దుబాయ్‌కి డబ్బు బదిలీ
  • ఇదే ముఠాపై మొత్తం 22 కేసులు ఉన్నట్లు గుర్తింపు
హైదరాబాద్ నగరంలో ‘డిజిటల్ అరెస్ట్’ మోసం కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఓ మహిళను భయభ్రాంతులకు గురిచేసి, ఆమె నుంచి రూ. 1.95 కోట్లకు పైగా వసూలు చేసిన కేసులో గుజరాత్‌కు చెందిన ఇద్దరు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన సయ్యద్ సోయబ్ జాహిద్ భాయ్, బేలిమ్ అనస్ రహీమ్ భాయ్‌గా గుర్తించారు.

వివరాల్లోకి వెళితే, డిసెంబర్ 13న ఓ మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ, టెలికాం శాఖల అధికారులమంటూ కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తనకు ఫోన్ చేశారని తెలిపింది. ఆమె భర్త తీవ్రమైన నేరాల్లో చిక్కుకున్నాడని, వెంటనే అరెస్ట్ చేయబోతున్నామని బెదిరించారని పేర్కొంది. ఈ క్రమంలో ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో తనను తీవ్ర భయాందోళనలకు గురిచేశారని వివరించింది.

వారి మాటలు నమ్మిన బాధితురాలు, కరెన్సీ సీరియల్ నంబర్ల వెరిఫికేషన్, కేసు విచారణ, క్లియరెన్స్ ప్రక్రియల పేరుతో వారు చెప్పిన బ్యాంకు ఖాతాలకు పలు దఫాలుగా రూ. 1,95,76,000 బదిలీ చేసింది. ఈ మోసంలో జాహిద్ భాయ్ నకిలీ బ్యాంకు ఖాతాలను (మ్యూల్ అకౌంట్స్) తెరిపించి, వాటి ద్వారా వచ్చిన డబ్బులో 15 శాతం కమీషన్ తీసుకునేవాడని పోలీసులు తెలిపారు. ఇక రహీమ్ భాయ్, దుబాయ్‌లో ఉన్న ప్రధాన సూత్రధారుల ఆదేశాల మేరకు హవాలా మార్గంలో డబ్బును బదిలీ చేసేవాడని డీసీపీ వి. అరవింద్ బాబు వివరించారు.

నిందితులు వృత్తిరీత్యా సైబర్ నేరగాళ్లని, వీరు ఉపయోగించిన బ్యాంకు ఖాతాలపై దేశవ్యాప్తంగా మొత్తం 22 కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ ఖాతాల ద్వారా సుమారు రూ. 3.5 కోట్ల లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో తేలింది.


More Telugu News