Ponnam Prabhakar: గల్ఫ్‌లోని తెలంగాణ ప్రజల ఇబ్బందులపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar Responds to Telangana Peoples Problems in Gulf
  • బోగస్ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని సూచించిన పొన్నం ప్రభాకర్
  • ప్రవాసుల సమస్యల కోసం ప్రవాసీ ప్రజావాణి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడి
  • టామ్ కామ్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు వెల్లడి
గల్ఫ్‌లోని తెలంగాణ ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని అసెంబ్లీ వేదికగా ఆయన సూచించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా, గల్ఫ్‌లో నివసిస్తున్న తెలంగాణ ప్రజల సమస్యలను పలువురు సభ్యులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.

ఈ విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, నకిలీ ఏజెంట్లను విశ్వసించి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రవాసుల సమస్యలను స్వీకరించడానికి ప్రజాభవన్‌లో ప్రవాసీ ప్రజావాణి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. గల్ఫ్‌కు వెళ్లే కార్మికుల సమస్యలను కూడా పరిష్కరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) ద్వారా విదేశాల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

అంతేకాకుండా, వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు వారి నైపుణ్యాలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. టామ్‌కామ్ ద్వారా మాత్రమే విదేశాలకు వెళ్లాలని ఆయన సూచించారు. ఈ సంస్థలో శిక్షణ పొంది ఇతర దేశాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని ఆయన కోరారు. నైపుణ్యం కలిగిన యువతకు గల్ఫ్‌తో పాటు ఇతర దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టామ్‌కామ్‌ను ఏర్పాటు చేసిందని ఆయన స్పష్టం చేశారు.
Ponnam Prabhakar
Telangana
Gulf
TOMCOM
Overseas Jobs
NRI
Telangana Assembly
Pravasi Bharathiya

More Telugu News