Harish Kumar Gupta: ఏపీలో నేరాలు బాగా తగ్గాయి: డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా
- పోలీసు శాఖ ఎంతో పురోగతి సాధించిందన్న డీజీపీ
- పోలీసింగ్ వ్యవస్థను ఆధునికంగా మారుస్తున్నామని వెల్లడి
- మావోల కార్యకలాపాలను కూడా కట్టడి చేస్తున్నామన్న డీజీపీ
గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వెల్లడించారు. 2025 సంవత్సరానికి సంబంధించి పోలీసుల పనితీరుపై రూపొందించిన ప్రత్యేక నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన డీజీపీ, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ మంచి పురోగతి సాధించిందని తెలిపారు.
ప్రత్యేకంగా మహిళల భద్రత విషయంలో పోలీసుల చర్యలు ఫలితాలు ఇచ్చాయని డీజీపీ చెప్పారు. మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడంలో, వేధింపుల కేసులను వేగంగా పరిష్కరించడంలో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అలాగే మత్తు పదార్థాల రవాణాపై దృష్టి సారించి గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను కట్టడి చేయడంలో కూడా గణనీయమైన విజయాలు సాధించామని చెప్పారు. దొంగిలించిన మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో సాంకేతికతను ఉపయోగించి వేల సంఖ్యలో ఫోన్లను బాధితులకు తిరిగి అందించామని వివరించారు.
రాబోయే రోజుల్లో పోలీసింగ్ వ్యవస్థను మరింత ఆధునికంగా మార్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ స్పష్టం చేశారు. వచ్చే పదేళ్లలో పోలీసింగ్ ఎలా ఉండాలి? ఎలాంటి మార్పులు అవసరం? సాంకేతికతను ఎలా వినియోగించాలి? అనే అంశాలపై రెండు రోజుల పాటు ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. సంక్రాంతి పండుగ తర్వాత ఈ వర్క్‌షాప్ జరగనుందని, ఇందులో పోలీసు విధుల్లో మార్పులు, ఆధునిక టెక్నాలజీ వినియోగంపై లోతైన చర్చలు జరుగుతాయని చెప్పారు. ప్రజలు నిజంగా కొత్త పోలీసింగ్ విధానాన్ని ప్రత్యక్షంగా చూడగలిగేలా ఈ కార్యక్రమం ఉంటుందని అన్నారు.
చట్టం ముందు అందరూ సమానమేనని డీజీపీ మరోసారి స్పష్టం చేశారు. ఎవరు చట్టానికి విరుద్ధంగా వ్యవహరించినా, ఎంతటి వారైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరంతర నిఘా కొనసాగిస్తూ మావోయిస్టు కార్యకలాపాలను కూడా కట్టడి చేస్తున్నామని తెలిపారు. ఇటీవల పలువురు మావోయిస్టులను అరెస్ట్ చేయడం ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు.
సైబర్ నేరాలపై కూడా డీజీపీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆన్‌లైన్ మోసాల వెనుక చైనా కేంద్రంగా పనిచేస్తున్న పెద్ద ముఠాలు ఉన్నాయని చెప్పారు. మోసం జరిగిన వెంటనే బాధితుల డబ్బు విదేశాలకు తరలిపోతుండటంతో ఆ మొత్తాన్ని తిరిగి రాబట్టడం చాలా కష్టంగా మారుతోందని తెలిపారు. అందుకే ప్రజలు ఎలాంటి ఆన్‌లైన్ లావాదేవీల్లోనైనా అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మొత్తంగా మహిళల భద్రత, మత్తు పదార్థాల నియంత్రణ, సైబర్ నేరాల అడ్డుకట్ట, నేరాల నియంత్రణే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. ప్రజల సహకారం ఉంటే రాష్ట్రాన్ని మరింత సురక్షితంగా మార్చగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.