Singapore: సొంతింటిలోనే అద్దెకు.. రూ.1.75 కోట్ల అప్పు రూ.147 కోట్లుగా మారిన వైనం!

In Shocking Debt Spiral Singapore Mans Rs 17 Crore Loan Balloons To Rs 147 Crore Heres How
  • సింగపూర్‌లో వడ్డీ వ్యాపారి దారుణం
  • రూ.1.75 కోట్ల అప్పు.. వడ్డీలతో రూ.147 కోట్లకు చేరిన వైనం
  • అప్పు తీర్చలేక వడ్డీ వ్యాపారికే ఇల్లు అమ్మకం
  • అమ్మేసిన సొంతింటిలోనే నెలకు రూ.4 లక్షలకు పైగా అద్దె
సింగపూర్‌లో అధిక వడ్డీలు, ఆలస్య రుసుముల కారణంగా ఒక వ్యక్తి జీవితం తలకిందులైంది. 2.5 లక్షల సింగపూర్ డాలర్లు (సుమారు రూ.1.75 కోట్లు) అప్పు తీసుకున్న ఒక వ్యక్తి, అది కాస్తా వడ్డీలతో పెరిగిపోయి 21 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.147 కోట్లు) చేరడంతో కష్టాల్లో కూరుకుపోయాడు. అప్పు తీర్చలేక, తను ఉంటున్న 2 మిలియన్ డాలర్ల విలువైన ఇంటిని అప్పు ఇచ్చిన సంస్థ డైరెక్టర్‌కే అమ్మి, ఇప్పుడు అదే ఇంట్లో నెలకు 7,000 నుంచి 8,500 డాలర్ల అద్దె చెల్లిస్తూ నివసిస్తున్నాడు.

అస‌లేం జ‌రిగిందంటే..!
బాధితుడు 2010లో ఒక లైసెన్స్‌డ్ వడ్డీ వ్యాపార సంస్థ నుంచి 2.5 లక్షల సింగపూర్ డాలర్లు అప్పు తీసుకున్నాడు. ఈ అప్పుపై నెలకు 4 శాతం వడ్డీ, ఆలస్యమైతే నెలకు 8 శాతం అదనపు వడ్డీ, నెలకు 2,500 డాలర్ల ప్రాసెసింగ్ ఫీజు విధించారు. ఈ అధిక ఛార్జీల వల్ల కేవలం నాలుగేళ్లలోనే అప్పు మొత్తం 3 మిలియన్ డాలర్లకు పెరిగింది.

2016 నాటికి అప్పు చెల్లించడం కష్టంగా మారడంతో తన కుటుంబాన్ని రోడ్డున పడకుండా కాపాడుకునేందుకు, బాధితుడు తన ఇంటిని అప్పు ఇచ్చిన సంస్థ డైరెక్టర్‌కు 2.1 మిలియన్ డాలర్లకు అమ్మాడు. అనంతరం అతనితోనే అద్దె ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే, అప్పుల ఊబి మాత్రం అతడిని వదల్లేదు. 2021 చివరి నాటికి బకాయి రూ.147 కోట్లకు చేరింది.

ఇటీవల అద్దె చెల్లింపులు, ఇంటిని ఖాళీ చేసే విషయమై యజమానితో కోర్టులో వివాదం తలెత్తడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసును విచారించిన హైకోర్టు.. లోన్, అద్దె ఒప్పందాలలో చట్టవిరుద్ధమైన అంశాలు ఉండవచ్చని అనుమానిస్తూ కేసును పునర్విచారణకు ఆదేశించింది. "కేవలం 2.5 లక్షల డాలర్ల అప్పు, వడ్డీలు, ఫీజుల కారణంగా కోట్లాది డాలర్లకు చేరడం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది" అని న్యాయమూర్తి ఫిలిప్ జయరత్నం వ్యాఖ్యానించారు. లోన్, ఇంటి అమ్మకం, అద్దె ఒప్పందాల వెనుక మోసం లేదా చట్టపరమైన ఉల్లంఘనలు జరిగాయా? అనే కోణంలో కోర్టు విచారణ జరుపుతోంది.
Singapore
Singapore debtor
Singapore loan
High interest rates
Debt trap
Singapore real estate
Loan dispute
Property sale
Court case Singapore
Financial crisis
Interest rates

More Telugu News