Sonam Yeshey: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. 7 పరుగులకే 8 వికెట్లు

Sonam Yeshey Sets T20 Record with 8 Wickets for 7 Runs
  • 7 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టిన భూటాన్ స్పిన్నర్
  • మయన్మార్‌తో జరిగిన మ్యాచ్‌లో సోనమ్ యెషీ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌
  • టీ20 చరిత్రలో 8 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ఘనత
టీ20 క్రికెట్ చరిత్రలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. భూటాన్‌కు చెందిన 22 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సోనమ్ యెషీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. మయన్మార్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో కేవలం 7 పరుగులిచ్చి ఏకంగా 8 వికెట్లు పడగొట్టి చరిత్రకెక్కాడు. టీ20 ఫార్మాట్ (పురుషుల, మహిళల క్రికెట్‌లో)లో ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా సోనమ్ యెషీ నిలిచాడు.

ఇంతకుముందు పురుషుల టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 7 వికెట్లుగా ఉండేవి. 2023లో చైనాపై మలేషియా బౌలర్ స్యాజుల్ ఇద్రుస్ 8 పరుగులకు 7 వికెట్లు తీశాడు. ఇప్పుడు ఆ రికార్డును సోనమ్ యెషీ బద్దలు కొట్టాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన యెషీ మొత్తం 12 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక, మ్యాచ్ విషయానికొస్తే, తొలుత బ్యాటింగ్ చేసిన భూటాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో సోనమ్ యెషీ తన స్పిన్ మాయాజాలంతో మయన్మార్‌ను వణికించాడు. ప్రత్యర్థి జట్టు 9.2 ఓవర్లలో కేవలం 45 పరుగులకే కుప్పకూలడంతో భూటాన్ 82 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భూటాన్ ఇప్పటికే 4-0 తేడాతో కైవసం చేసుకుంది. సోమవారం జరిగే చివరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది.
Sonam Yeshey
Bhutan cricket
T20 record
cricket record
T20 cricket
Myanmar cricket
Sonam Yeshey bowling
T20 series
cricket news

More Telugu News