Elon Musk: ఇది మంచిది కాదు... వెండి ధరల పెరుగుదలపై ఎలాన్ మస్క్ ఆందోళన

Silver Prices Surge Triggers Concern from Elon Musk
  • పారిశ్రామిక అవసరాలకు వెండి చాలా కీలకమని వ్యాఖ్య
  • ఈ ఏడాది ఏకంగా 158 శాతం మేర పెరిగిన వెండి ధరలు
  • స్పెక్యులేటివ్ ట్రేడింగ్, పెరిగిన డిమాండ్ వల్లే ధరల పెరుగుదల
ప్రపంచ మార్కెట్లలో వెండి ధరలు రికార్డు స్థాయిలో పరుగులు పెట్టడంపై టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పారిశ్రామిక అవసరాలకు వెండి చాలా కీలకమైందని, అయితే ఈ స్థాయిలో ధరలు పెరగడం మంచిది కాదని ఆయన హెచ్చరించారు. "ఇది మంచిది కాదు. అనేక పారిశ్రామిక ప్రక్రియలకు వెండి అవసరం" అని ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' లో పోస్ట్ చేశారు.

ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీలో వెండిని ఎక్కువగా వినియోగిస్తారు. టెస్లా అధినేత అయిన మస్క్ ఆందోళన వెనుక ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర ఔన్సుకు 79 డాల‌ర్ల‌ వద్ద ట్రేడ్ అయింది. అంతకుముందు స్పాట్ మార్కెట్లో ఏకంగా 84 డాల‌ర్ల రికార్డు స్థాయిని తాకి, లాభాల స్వీకరణ కారణంగా 8 శాతం మేర పడిపోయింది. అయినప్పటికీ ఈ ఏడాదిలో ఇప్పటివరకు వెండి సుమారు 158 శాతం పెరిగింది.

పారిశ్రామిక డిమాండ్ విపరీతంగా పెరగడం, సరఫరాలో కొరత, స్పెక్యులేటివ్ పెట్టుబడులు వెండి ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని విశ్లేషకులు చెబుతున్నారు. సోలార్ ప్యానెళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లలో వెండి వాడకం పెరగడంతో నిల్వలు తగ్గుతున్నాయి. మస్క్ ఆందోళనపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. "ఎలాన్ మస్క్ కూడా ఆందోళన చెందుతున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు" అని ఒక యూజర్ వ్యాఖ్యానించారు.

ఇక, భారత మార్కెట్లోనూ వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఎంసీఎక్స్ (MCX)లో మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు రూ. 2,49,282 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తన నివేదికలో వెండి ధరలు అధికంగా పెరిగాయని, భవిష్యత్తులో దిద్దుబాటుకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
Elon Musk
Silver price
Tesla
SpaceX
Silver rate hike
Electric vehicles
Industrial demand
MCX
Silver futures
Commodity market

More Telugu News