రిటైర్మెంట్ హోమ్ లో మంటలు.. ఇండోనేసియాలో 16 మంది వృద్ధుల మృతి

  • మరో 15 మందిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది
  • బాధితులకు మనాడోలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స
  • నార్త్ సులవేసి ప్రావిన్స్ లో విషాదం
ఇండోనేషియాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నార్త్ సులవేసి ప్రావిన్స్ లోని ఓ రిటైర్మెంట్ హోమ్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడడంతో 16 మంది వృద్ధులు సజీవదహనమయ్యారు. సోమవారం నార్త్ సులవేసి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మనాడోలోని ఓ రిటైర్మెంట్ హోమ్ లో ఆదివారం రాత్రి మంటలు ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కల వారు సమాచారం అందించడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

మంటల ధాటికి అప్పటికే 16 మంది వృద్ధులు మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది హోమ్ లోని 15 మందిని కాపాడి ఆసుపత్రులకు తరలించారు. మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగించేందుకు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. ప్రాథమిక పరిశీలనలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు తేలిందని, పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు.


More Telugu News