Koneru Humpy: వరల్డ్ ర్యాపిడ్ చెస్‌లో మెరిసిన తెలుగు తేజాలు.. హంపి, అర్జున్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు

Andhra Pradesh CM congratulates Koneru Humpy
  • వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు
  • కోనేరు హంపి, అర్జున్ ఎరిగైసిలకు సీఎం చంద్రబాబు అభినందనలు
  • విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన ఏకైక భారతీయుడిగా అర్జున్
  • హంపికి పలువురు ఏపీ మంత్రులు, అర్జున్‌కు బండి సంజయ్ ప్రశంసలు
ఫిడే వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు సాధించిన తెలుగు క్రీడాకారులు కోనేరు హంపి, అర్జున్ ఎరిగైసిలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. సోమవారం నాడు ఎక్స్ వేదికగా ఆయన ఇద్దరు క్రీడాకారులను ప్రత్యేకంగా ప్రశంసించారు.

కోనేరు హంపిని ఉద్దేశించి చంద్రబాబు స్పందిస్తూ, "ఒక్క ఫలితంతో ఛాంపియన్లను అంచనా వేయలేం. అత్యున్నత స్థాయిలో పదేపదే పోటీపడే ధైర్యమే వారిని నిలబెడుతుంది. ప్రపంచ వేదికపై కాంస్యం సాధించడం మీ నైపుణ్యానికి నిదర్శనం. మీ ప్రయాణం, నిలకడ దేశంలోని లక్షలాది మందికి స్ఫూర్తినిస్తుంది" అని పేర్కొన్నారు.

అదేవిధంగా అర్జున్ ఎరిగైసిని కూడా ఆయన కొనియాడారు. "పురుషుల్లో గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన ఏకైక భారత క్రీడాకారుడిగా అర్జున్ నిలిచారు. తెలంగాణ బిడ్డ అయిన అర్జున్, భారత చెస్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేర్చారు" అని చంద్రబాబు అన్నారు.

మరోవైపు, రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, హోం మంత్రి వి. అనిత, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ఛైర్మన్ ఎ. రవి నాయుడు కూడా హంపికి శుభాకాంక్షలు తెలిపారు. హంపి ఇప్పటికే ఈ ఛాంపియన్‌షిప్‌లో ఐదు పతకాలు సాధించిందని, ఆమె మహిళా క్రీడాకారులందరికీ స్ఫూర్తిదాయకమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా అర్జున్‌ను అభినందించారు. తెలంగాణ గడ్డకు గర్వకారణంగా నిలిచిన అర్జున్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా హంపిని కూడా అభినందించిన బండి సంజయ్, ఆమె దేశం గర్వపడేలా చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు.
Koneru Humpy
Arjun Erigaisi
World Rapid Chess Championship
Andhra Pradesh
Nara Chandrababu Naidu
Viswanathan Anand
Indian chess
chess championship
sports news
chess players

More Telugu News