KTR: అసెంబ్లీలో కేసీఆర్ కు రేవంత్ పలకరింపుపై కేటీఆర్ స్పందన

KTR Reacts to Revanth Greeting KCR in Assembly
  • తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ జనం గుండెల్లో ఉన్నారని వ్యాఖ్య
  • నన్ను తిడితే పడతానేమో.. కేసీఆర్ ను తిడితే సహించబోనని వార్నింగ్
  • రేవంత్ రెడ్డి దోపిడీని అడ్డుకుంటున్నందుకే నన్ను తిడుతున్నారని కేటీఆర్ విమర్శ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు ఉదయం అసెంబ్లీకి వచ్చిన విషయం తెలిసిందే. సభలో తన సీటులో కూర్చున్న కేసీఆర్ వద్దకు వెళ్లి మరీ సీఎం రేవంత్ రెడ్డి పలకరించడం, ఆయనతో కరచాలనం చేసి ఆరోగ్యం గురించి వాకబు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఈ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా స్పందించారు. ముఖ్యమంత్రి సభలో కేసీఆర్‌ను కలిసేంత సంస్కారం ఉంటే చాలని, అయితే, ఇదే సంస్కారం బయట మాటల్లో కూడా ఉంటే ఇంకా బాగుంటుందని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు పలకరించుకునేంత సానుకుల వాతావరణం ఉంటే మంచిదేనని పేర్కొన్నారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్‌ పట్ల రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ గౌరవం ఉందని కేటీఆర్‌ చెప్పారు.

రంధ్రాన్వేషణ మానుకోవాలి..
పాలమూరు-రంగారెడ్డి విషయంలో రంధ్రాన్వేషణ మానుకోవాలని సీఎం రేవంత్‌ రెడ్డికి కేటీఆర్ హితవు పలికారు. కేసీఆర్ కు మంచి పేరు వస్తుందనే పాలమూరు-రంగారెడ్డి పనులను ప్రభుత్వం చేయటంలేదని ఆరోపించారు. దీనివల్ల అంతిమంగా రాష్ట్రానికే నష్టమని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ చిత్తశుద్ధిని కాళేశ్వరం విషయంలో చూడాలని అన్నారు. గోదావరిలో నీటి హక్కుల కోసమే కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులను కేసీఆర్‌ చేపట్టారని చెప్పారు. రేవంత్‌ రెడ్డి దోపిడీని అడుగడుగునా అడ్డుకుంటున్నందుకే నన్ను తిడుతున్నారు.. ఆయన తిట్లే నాకు దీవెనలు అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘నన్ను తిడితే పడతానేమో కానీ.. కేసీఆర్‌ను అంటే మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదు’ అని హెచ్చరించారు.

పార్టీని వీడిన వారిని మళ్లీ తీసుకోబోం..
అధికారం కోల్పోగానే, ఆదరించిన పార్టీని వీడిన నేతలను తిరిగి పార్టీలోకి ఆహ్వానించకూడదనేది తన అభిప్రాయమని కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన నేతల నియోజకవర్గాల్లో ఎన్ని సర్పంచ్‌ స్థానాలు గెలిచారని ప్రశ్నించారు. నేతల బలంలేకున్నా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు సర్పంచ్‌లను గెలిపించుకున్నారని చెప్పారు. 

క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మారాయి..
అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇప్పటికి పరిస్థితులు మారాయని కేటీఆర్ చెప్పారు. సర్పంచ్ ఎన్నికల్లో ఎదురైన వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ సర్కారు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టడం లేదని విమర్శించారు. ఫైనాన్స్‌ కమిషన్‌ నిధుల కోసం.. అదికూడా తప్పనిసరి పరిస్థితుల్లో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.
KTR
K Taraka Rama Rao
Revanth Reddy
KCR
Telangana Assembly
BRS
Palamuru Rangareddy
Kaleshwaram Project
Telangana Politics
BRS leaders

More Telugu News