Apple: భారత్‌లో యాపిల్ హవా.. అమ్మకాల్లో ఐఫోన్ 16 సరికొత్త రికార్డు!

Apple iPhone 16 Records Sales in India
  • భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా ఐఫోన్ 16
  • 11 నెలల కాలంలో 65 లక్షల యూనిట్ల విక్రయం
  • మేడ్ ఇన్ ఇండియా వ్యూహంతో దూసుకెళ్తున్న యాపిల్
  • రికార్డు స్థాయిలో 9 బిలియన్ డాలర్ల దేశీయ అమ్మకాలు
భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025 మొదటి 11 నెలల కాలంలోనే ఏకంగా 65 లక్షల 'ఐఫోన్ 16' యూనిట్లను విక్రయించి, దేశంలో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా రికార్డు నెలకొల్పింది. ఈ విషయాన్ని ప్రముఖ రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ తన తాజా నివేదికలో వెల్లడించింది.

ఈ నివేదిక ప్రకారం అమ్మకాల్లో యాపిల్ తన ప్రధాన పోటీదారులైన ఆండ్రాయిడ్ ఫోన్లను అధిగమించింది. కేవలం ఐఫోన్ 16 మాత్రమే కాకుండా ఐఫోన్ 15 కూడా టాప్ 5 జాబితాలో నిలవడం యాపిల్ ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తోంది. బడ్జెట్, మిడ్-రేంజ్ ఫోన్లకు ప్రసిద్ధి చెందిన భారత మార్కెట్లో వినియోగదారుల కొనుగోలు ప్రవర్తన మారుతోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

స్థానికంగా తయారీని పెంచడం, చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం వంటి యాపిల్ వ్యూహాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇటీవల బెంగళూరు, పూణె, నోయిడాలలో మూడు కొత్త స్టోర్లను ప్రారంభించడంతో దేశంలో యాపిల్ రిటైల్ స్టోర్ల సంఖ్య ఐదుకు చేరింది. దీనికి తోడు నో-కాస్ట్ ఈఎంఐ, క్యాష్‌బ్యాక్, బ్యాంక్ ఆఫర్ల వంటి సదుపాయాలు ఖరీదైన ఫోన్లను సామాన్యులకు సైతం అందుబాటులోకి తెస్తున్నాయి.

2025 ఆర్థిక సంవత్సరంలో యాపిల్ ఇండియా దేశీయంగా 9 బిలియన్ డాలర్ల రికార్డు అమ్మకాలను నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా తయారైన ప్రతి ఐదు ఐఫోన్లలో ఒకటి భారత్‌లోనే తయారవడం విశేషం. అంతేకాకుండా నవంబర్ నెలలో భారత్ నుంచి ఏకంగా 2 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను యాపిల్ ఎగుమతి చేసింది. తొలిసారిగా ఐఫోన్ ప్రో, ప్రో మ్యాక్స్ వంటి హై-ఎండ్ మోడళ్లను కూడా భారత్‌లోనే అసెంబుల్ చేయడం ప్రారంభించింది.
Apple
iPhone 16
India smartphone market
iPhone sales India
Counterpoint Research
Apple India
iPhone 15
Made in India iPhones
Apple retail stores India
iPhone exports

More Telugu News