ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ.. హాజరైన విపక్ష నేత కేసీఆర్

  • విపక్ష నేత హోదాలో సభకు హాజరైన కేసీఆర్
  • ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న బీఆర్ఎస్
  • అసెంబ్లీ ముట్టడికి యత్నించిన మాజీ సర్పంచ్‌ల అరెస్ట్
  • సభ చుట్టూ వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు
తెలంగాణ శాసనసభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఓవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో సభకు హాజరుకాగా, మరోవైపు మాజీ సర్పంచ్‌లు అసెంబ్లీ ముట్టడికి యత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విపక్ష నేతగా కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీశ్‌రావు తదితర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు.

సమావేశాలు ప్రారంభమైన వెంటనే దివంగత రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డికి సభ సంతాపం ప్రకటించింది. అనంతరం సభను వాయిదా వేశారు. అయితే, సాగునీటి ప్రాజెక్టులు, ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది.

ఇదే సమయంలో తమకు రావలసిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలంటూ మాజీ సర్పంచ్‌లు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకుని, పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆందోళన గురించి ముందే సమాచారం ఉండటంతో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో దాదాపు వెయ్యి మంది సిబ్బందితో మూడంచెల భద్రతను ఏర్పాటు చేసి భారీ బందోబస్తు నిర్వహించారు.


More Telugu News