Revanth Reddy: దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్

Revanth Reddy Counters Digvijay Singhs Comments
  • మారుమూల గ్రామంలో పుట్టిన పీవీ దేశ ప్రధాని అయ్యారని వ్యాఖ్య
  • మన్మోహన్ సింగ్ ను సోనియా ప్రధానిని చేశారని గుర్తు చేసిన సీఎం
  • దేశ సేవకు సోనియా గాంధీ అంకితభావంతో కృషి చేస్తున్నారంటూ పొగడ్తలు
ఆర్ఎస్ఎస్ పై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా స్పందించారు. దిగ్విజయ్ సింగ్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఆయనకు చురకలు వేశారు. ఆర్ఎస్ఎస్ లోనే కాదు కాంగ్రెస్ పార్టీలోనూ ప్రతిభకు పట్టం కడతారని, నిస్వార్థంగా పాటుపడే వారికి తగిన గౌరవం దక్కుతుందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు.

తెలంగాణలోని ఓ మారుమూల గ్రామంలో జన్మించిన పీవీ నరసింహారావు కాంగ్రెస్ పార్టీలోనే ఎదిగారని, దేశానికి ప్రధానిగా సేవలందించారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వ్యవహరించిన సమయంలో సోనియా గాంధీ దేశ సేవకే ప్రాధాన్యమిస్తూ మన్మోహన్ సింగ్ ను ప్రధానిని చేశారని చెప్పారు. అంకితభావానికి, విలువలతో కూడిన రాజకీయానికి సోనియా మారుపేరుగా నిలిచారని ప్రశంసలు కురిపించారు.

దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి నేతృత్వం వహించడం నుంచి రాజ్యాంగానికి రూపకల్పన చేయడం వరకూ.. ప్రజాస్వామ్య వ్యవస్థల నిర్మాణం నుంచి భారత ప్రజల్లో ఐకమత్యం పెంపొందించడం వరకూ.. భారత దేశంలోని అన్ని వ్యవస్థలను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తీర్చిదిద్దిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Revanth Reddy
Digvijay Singh
RSS
Congress Party
Telangana
PV Narasimha Rao
Sonia Gandhi
Manmohan Singh
Indian National Congress

More Telugu News