Chandrababu Naidu: నేడు ఏపీ కేబినెట్ భేటీ .. చర్చించే కీలక అంశాలు ఇవే!

Chandrababu Naidu AP Cabinet Meeting Key Decisions
  • మూడు కొత్త జిల్లాలు, పలు రెవిన్యూ డివిజన్ల ఏర్పాటునకు ఆమోదం తెలపనున్న కేబినెట్
  • రెండు ఎకరాల విస్తీర్ణంలో రూ.103.96 కోట్ల వ్యయంతో అత్యాధునిక పరిశోధనా కేంద్రం ఏర్పాటునకు గ్రీన్ సిగ్నల్  
  • వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రి మండలి నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనా సంస్కరణలు, రాజధాని అమరావతి విస్తృత అభివృద్ధికి సంబంధించిన అనేక కీలక అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. 

ప్రధానంగా, ఈ సమావేశంలో పరిపాలనను మరింత వికేంద్రీకరించి ప్రజలకు సేవలు వేగంగా అందించాలన్న లక్ష్యంతో మూడు కొత్త జిల్లాలు, పలు రెవిన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం లభించే అవకాశముంది. అలాగే అమరావతిని ఆధునిక సాంకేతిక, పరిశోధనా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మరో ముందడుగుగా క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ప్రాంగణంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో రూ.103.96 కోట్ల వ్యయంతో అత్యాధునిక పరిశోధనా కేంద్రం ఏర్పాటునకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.
 
సచివాలయ పరిధిలోని అఖిల భారత సేవా అధికారుల నివాస భవనాలకు అదనపు మౌలిక సదుపాయాలు, ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు రూ.109 కోట్ల నిధుల కేటాయింపుపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఇదే విధంగా అమరావతి పరిధిలోని శాఖమూరు గ్రామంలో 23 ఎకరాల భూమిలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల నిర్మాణానికి అనుమతి ఇవ్వనున్నారు.
 
రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెంచే లక్ష్యంతో తుళ్లూరు ప్రాంతంలో ఆరు ఎకరాల భూమిని హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కేటాయించే ప్రతిపాదనను ఆమోదించనున్నారు. వర్షాకాలంలో రాజధాని పరిసరాలను వరద ముంపు నుంచి రక్షించేందుకు రూ.444 కోట్ల వ్యయంతో 8,400 క్యూసెక్కుల సామర్థ్యం గల ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. 
 
అమరావతి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఎల్పీఎస్ జోన్ - 8 పరిధిలో లే అవుట్ల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం రూ.1,358 కోట్ల నిధుల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ఇవేకాకుండా పలు సంస్థలకు భూముల కేటాయింపులు, రుషికొండ భవనాల అంశంపై చర్చ, మెడికల్ కాలేజీల టెండర్లు, పీపీపీ విధానంపై మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. 

కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం, ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉందని సమాచారం. 
Chandrababu Naidu
AP Cabinet Meeting
Andhra Pradesh
Amaravati
New Districts
Infrastructure Development
Quantum Computing Center
Flood Management
Land Allocation
Political Developments

More Telugu News