Donald Trump: ట్రంప్ ‘టారిఫ్’ విధానాలు ఒక విపత్తు.. దుమ్మెత్తిపోసిన అమెరికా మీడియా

Donald Trump Tariff Policies a Disaster US Media Slams
  • ట్రంప్ వాణిజ్య యుద్ధాల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందన్న ‘సదరన్ కాలిఫోర్నియా న్యూస్ గ్రూప్’  
  • తప్పుడు విధానాల వల్ల నష్టపోయిన రైతుల కోసం రూ. లక్ష కోట్లు వెచ్చించడం పరిపాలన వైఫల్యమేనని విశ్లేషణ
  • కేవలం సోయాబీన్ వంటి పంటలకే ఈ నిధులు పరిమితమయ్యాయని, చిన్న రైతులు ఆకలితో అలమటిస్తున్నారని ఆరోపణ
  • టారిఫ్‌ల వల్ల కేవలం వ్యవసాయమే కాకుండా ట్రాక్టర్ల తయారీ వంటి పారిశ్రామిక రంగాలు వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయని హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వాణిజ్య విధానాలు ఆ దేశానికే శాపంగా మారుతున్నాయని అక్కడి మీడియా వర్గాలు మండిపడుతున్నాయి. విదేశీ వస్తువులపై ఆయన విధిస్తున్న భారీ సుంకాలు, తద్వారా మొదలైన వాణిజ్య యుద్ధాలు ఒక ‘డిజాస్టర్’ (విపత్తు) అని ప్రముఖ మీడియా సంస్థ ఎస్‌సీఎన్‌జీ తన సంపాదకీయం‌లో ధ్వజమెత్తింది.

ట్రంప్ విధానాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఈ నెలలో 12 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.01 లక్షల కోట్లు) భారీ పరిహారాన్ని ప్రకటించింది. అయితే, తన సొంత నిర్ణయాల వల్ల సృష్టించబడిన సమస్యను పరిష్కరించడానికి ఇంత భారీ మొత్తంలో ప్రజా ధనాన్ని వెచ్చించాల్సి రావడం ప్రభుత్వ వైఫల్యం కాదా? అని మీడియా ప్రశ్నించింది. ఈ సుంకాలు విదేశాల మీద కాకుండా, అమెరికా వినియోగదారులపై పడుతున్న అదనపు పన్నులని ఎడిటోరియల్ విశ్లేషించింది.

ముఖ్యంగా గ్లోబలైజేషన్ కాలంలో ఇలాంటి పాతకాలపు వాణిజ్య పద్ధతులు పని చేయవని, ఇవి దేశ ఆర్థిక వృద్ధిని మందగింపజేయడమే కాకుండా ఇతర దేశాలతో సంబంధాలను దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం రైతులకే కాకుండా, ట్రాక్టర్ తయారీ దిగ్గజం 'జాన్ డీర్' వంటి సంస్థలకు కూడా ఈ విధానాల వల్ల 600 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోందని, ఇది అమెరికా పారిశ్రామిక రంగాన్ని ప్రమాదంలోకి నెడుతోందని మీడియా సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది.
Donald Trump
Trump tariffs
US trade policy
trade war
US economy
globalization
American farmers
John Deere
US media
SCNG editorial

More Telugu News