టీమిండియా వన్డే జట్టులో భారీ మార్పులు: బుమ్రా, పాండ్యాకు విశ్రాంతి

  • న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు బుమ్రా, హార్దిక్ పాండ్యా దూరం
  • టీ20 ప్రపంచకప్ దృష్ట్యా కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై మేనేజ్‌మెంట్ ప్రత్యేక దృష్టి
  • రిషబ్ పంత్ స్థానంలో ఇషాన్ కిషన్ లేదా జితేష్ శర్మకు అవకాశం
  • వన్డేలకు దూరమైనా నిబంధనల ప్రకారం విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్న పాండ్యా
రాబోయే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని టీమిండియా మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ నుంచి స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే, ఆ వెంటనే జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు మాత్రం వీరిద్దరూ అందుబాటులో ఉంటారు.

పాండ్యా కొంతకాలంగా వన్డే ఫార్మాట్‌కు దూరంగా ఉంటుండగా, బుమ్రా పనిభారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, సీనియర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా వన్డే సిరీస్‌లో ఆడే అవకాశం లేదు. దీంతో దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న ఇషాన్ కిషన్‌కు మళ్లీ పిలుపు వచ్చే అవకాశం ఉంది. వన్డే జట్టును జనవరి 4 లేదా 5 తేదీల్లో ప్రకటించే ఛాన్స్ ఉంది.

మరోవైపు, అంతర్జాతీయ వన్డేలకు విశ్రాంతి తీసుకున్నప్పటికీ, హార్దిక్ పాండ్యా బరోడా తరఫున విజయ్ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడనున్నాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లు దేశవాళీ టోర్నీల్లో ఆడటం తప్పనిసరి కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు.


More Telugu News